logo

తెలుగు భాష పరిరక్షణకు పాటుపడదాం

తేనెలొలికే తెలుగు భాషను మనంతట మనమే తక్కువ చేసుకుంటూ.. చివరకు భ్రష్టు పట్టిస్తున్నామని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కళ్లు తెరిచి తెలుగును బతికించుకోవడానికి కంకణబద్ధులం కావాలని

Published : 27 Jun 2022 02:40 IST

‘మై మ్యూజింగ్స్‌ ఆన్‌ గాడ్‌’ పుస్తకం, పార్థ శతకం ఆడియో ఆవిష్కరణలో వక్తలు


పుస్తకావిష్కరణలో బి.ఎన్‌.శాస్త్రి, కె.ఎస్‌.మూర్తి, డా.సత్యనాథ్‌ పట్నాయక్‌, గంగాధర శాస్త్రి, రచయిత డా.అంచల పార్థసారథి, పంపాపతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తేనెలొలికే తెలుగు భాషను మనంతట మనమే తక్కువ చేసుకుంటూ.. చివరకు భ్రష్టు పట్టిస్తున్నామని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కళ్లు తెరిచి తెలుగును బతికించుకోవడానికి కంకణబద్ధులం కావాలని పిలుపునిచ్చారు. అంచల సుబ్బన్న మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రముఖ చర్మవ్యాధి వైద్య నిపుణులు డాక్టర్‌ అంచల పార్థసారథి రచించిన ‘మై మ్యూజింగ్స్‌ ఆన్‌ గాడ్‌’ ఆంగ్ల పుస్తకం, అలాగే పార్థ శతకం (వ్యక్తిత్వ వికాస పద్యాలు) ఆడియో (పెన్‌డ్రైవ్‌) ఆవిష్కరణ సభ ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో  జరిగింది. తొలుత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆధ్యాత్మికవేత్త, పాత్రికేయులు డా.కె.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ.. ‘మా మాతృభాష తమిళం. అందులో రెండు వేలకుపైగా రామాయణ ప్రవచనాలు చేశాను. నేను ఒక గురువు వద్ద తెలుగు భాష నేర్చుకున్నాను. అనంతరం పద్మశ్రీ డా.పుల్లెల రామచంద్రుడు రచించిన శ్రీమద్‌రామాయణం చదివాక తెలుగుపై మమకారం పెరిగింది. తెలుగు ఎంతో గొప్పది, ఇక్కడున్న హరికథలు, బుర్రకథలు మరేభాషలోనూ లేవు. మనమే ఈ భాషను నాశనం చేసుకుంటున్నాం. వృత్తిరీత్యా వైద్యుడైన పార్థసారథి.. మనసుకు హత్తుకునేలా రచనలు చేశారు’ అని ఆయన అభినందించారు. ‘పార్థ శతకం’ ఆడియోను భగవద్గీత ఫౌండేషన్‌ సంస్థాపక అధ్యక్షుడు ఎల్‌.గంగాధరశాస్త్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నేటి యువతరానికి నైతిక విలువలను, జీవన వికాస సత్యాలను అత్యంత సులభంగా, సుందరంగా పార్థ శతకంలో పొందుపరిచారని రచయితను అభినందించారు. ప్రముఖ రచయిత, కార్టూనిస్టు బ్నిం, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్‌ సత్యనాథ్‌ పట్నాయక్‌లు, సాహితీవేత్త బి.ఎన్‌. శాస్త్రి, వక్త బి.ఎస్‌. శర్మలతో పాటు రచయిత అంచల పార్థసారథి కూడా మాట్లాడారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు అంచల పంపాపతి స్వాగతం పలికారు. తొలుత జి.ఆర్‌.నరేన్‌ బృందంచే భక్తిరంజని, అంచల నాగసాహితీ, బసవరాజు వెంకట కమలనాభం, శ్రీకర్‌ జొన్నలగడ్డ, కార్తికేయ అవసరాలలు పార్థ శతక గీతాలను ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని