logo

హెచ్‌ఐసీసీ అష్టదిగ్బంధం

ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులు పాల్గొనే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అత్యంత పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించే హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు ప్రధాని, ఇతర ప్రముఖులు బస చేసే హోటళ్లను గురువారం సాయంత్రం....

Published : 30 Jun 2022 02:28 IST

భాజపా జాతీయ సమావేశాలకు నగరం ముస్తాబు

కాషాయమయంగా మారిన నెక్లెస్‌రోడ్డు పీవీ నరసింహారావు మార్గ్‌

 

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే- మాదాపూర్‌, రాయదుర్గం: ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులు పాల్గొనే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అత్యంత పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించే హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు ప్రధాని, ఇతర ప్రముఖులు బస చేసే హోటళ్లను గురువారం సాయంత్రం నుంచి పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ).. రాష్ట్ర పోలీసులతో కలిసి తనిఖీలు మొదలుపెట్టింది. సమావేశాలు నిర్వహించే ప్రాంతమంతటినీ మూడు రోజులపాటు అష్టదిగ్బంధం చేయనున్నారు. డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని ఎనిమిది మంది ఎస్పీజీ బృందం రెండు రోజులుగా నగరంలో ఏర్పాట్లను క్షుణ్నంగా సమీక్షిస్తోంది. రెవెన్యూ, వైద్యశాఖ, అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ అధికారులకూ ఎస్పీజీ బృందం తగు సూచనలిచ్చింది. హెచ్‌ఐసీసీ పరిసరాల్లో డ్రోన్‌లు, మైక్రోలైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, పారా గ్లైడర్‌లు ఎగురవేయడాన్ని నిషేథిస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.


సికింద్రాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ఎస్పీజీ అధికారి

ప్రధాని పర్యటన వివరాలు గోప్యం

హెచ్‌ఐసీసీకి వచ్చేవారిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 1,600 పోలీసు సిబ్బంది బందోబస్తు విధులకు రానున్నట్లు సమాచారం. భద్రతా కారణాలరీత్యా ప్రధాని పర్యటించనున్న మార్గాలు, కార్యక్రమాల వివరాలను గోప్యంగా ఉంచారు.


పరేడ్‌ మైదానంలో డాగ్‌స్క్వాడ్‌ తనిఖీ

కరెంట్‌ పోకుండా ఏర్పాట్లు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణాలకు నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ హాజరవుతుండటంతో బుధవారం ఎస్పీజీ అధికారులు నిర్వహించిన సమావేశానికి డిస్కం అధికారులు హాజరయ్యారు. నిర్వాహకులతోనూ సమావేశమై ఏర్పాట్ల గురించి వివరించారు. విద్యుత్తు సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే లైన్ల తనిఖీ చేపట్టారు. ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థను పరిశీలించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని