logo

‘భూములు ఇస్తామని.. ఉన్నవి లాక్కోవడం అన్యాయం’

జిన్‌గుర్తిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 267 ఎకరాల భూసేకరణపై రైతులు మండిపడ్డారు. తాండూరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌ రైతుల అభిప్రాయ సేకరణ నిమిత్తం శుక్రవారం సమావేశం నిర్వహించారు. 206 సర్వే సంఖ్యలో

Published : 02 Jul 2022 02:04 IST

అధికారులను ప్రశ్నిస్తున్న రైతులు

జిన్‌గుర్తి(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: జిన్‌గుర్తిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 267 ఎకరాల భూసేకరణపై రైతులు మండిపడ్డారు. తాండూరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌ రైతుల అభిప్రాయ సేకరణ నిమిత్తం శుక్రవారం సమావేశం నిర్వహించారు. 206 సర్వే సంఖ్యలో 42 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు గతంలో రైతులకు పంపిణీ చేసిన 225 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీవో ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను లాక్కోవడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులకు మూడు ఎకరాల చొప్పున భూములు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉన్న భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు? ఎట్టిపరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదన్నారు. దీంతో ఆర్డీవో మాట్లాడుతూ..ప్రభుత్వం రైతులకు భూవిస్తీర్ణాన్ని బట్టి పరిహారం అందజేస్తుందన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు విపణి ధరకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తారని నచ్చజెప్పారు. మరోసారి గ్రామంలో ఈనెల 7న ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తామని అక్కడ తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. తహసీల్దారు చిన్నప్పలనాయుడు, వీఆర్‌ఓ సాయిరెడ్డి, రైతు సమితి అధ్యక్షులు రామలింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్యామప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని