logo

ఆసరా.. ఎదురుచూపులే మిగులు!

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. నెలల తరబడి బకాయిలతో పింఛన్‌ పొందేందుకు నిరీక్షణ తప్పడం లేదు.

Published : 07 Aug 2022 02:27 IST

రూ.64.91 కోట్ల బకాయిలు

దరఖాస్తుల పరిశీలన ఇంకెప్పుడో..

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ


పింఛన్ల కోసం వేచిచూస్తూ...

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. నెలల తరబడి బకాయిలతో పింఛన్‌ పొందేందుకు నిరీక్షణ తప్పడం లేదు. ఎప్పటికప్పుడు చెల్లిస్తేనే నిరుపేదలకు లబ్ధి చేకూరేది. ఇదే సమయంలో దాదాపు రెండేళ్ల క్రితం నుంచి దరఖాస్తులు సమర్పించి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్న వారి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటోంది. జిల్లాలో ఆసరా పథకం అమలుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రతి నెలా 5వ తేదీ లోపు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడి కార్మికులకు నెలకు రూ.2,016ల చొప్పున పింఛన్‌ చెల్లిస్తోంది. దివ్యాంగులకు మరింత అదనంగా నెలకు రూ.3,016ల చొప్పున మంజూరు చేస్తోంది. జిల్లాలోని 18 మండలాలతోపాటు తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.21.63కోట్లు అందించాల్సి ఉంది. గతంలో నెలనెలా 5వ తేదీలోగా చెల్లించే వారు. ఆ తర్వాత సమయసారిణి విస్మరించారు. ఏకంగా రెండుమూడు నెలలు ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. మే నెలకు సంబంధించి పింఛన్‌ డబ్బుల్ని వారంరోజులుగా పంపిణీ చేస్తున్నారు.

కొత్తవాటికి మోక్షమెప్పుడో!

లబ్ధిదారుల పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా అర్హులైన వారు వేలాది మంది దరఖాస్తులు సమర్పించారు. వీరందరికి మంజూరు చేయకపోవడం నిరీక్షించక తప్పడం లేదు. 2019 సంవత్సరం నుంచి 9,721మంది దరఖాస్తులు ఇచ్చారు. 1,128మంది వృద్ధాప్య, 6,484 వింతతు, 21 గీత, 280మంది ఒంటరి మహిళలు, 1,470మంది దివ్యాంగులు వీరిలో ఉన్నారు. నాలుగైదుసార్లు దరఖాస్తులు అందించినా పింఛన్‌లకు మోక్షం లభించడం లేదు. దరఖాస్తుదారుల్లో ఇరవై శాతం మంది మృతి చెందినట్లు అంచనా.

రెండేళ్లుగా తిరుగుతున్నా.. : - శివమ్మ, సంగెంకలాన్‌

భర్త మారెప్ప బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లి మృతి చెందాడు. కూలీ పనులు చేసి బతుకుదామంటే చేతనైతలేదు. ప్రభుత్వం ఆసరా పథకం పింఛన్‌ మంజూరు చేస్తుందని దరఖాస్తు చేసినా. మూడు సంవత్సరాలు దాటినా మంజూరు చేయలేదు. కార్యాలయాల చుట్టు తిరిగినా ఫలితం లేదు.

మంజూరు చేయాలి : - జగ్గమ్మ, మల్కాపూర్‌.

ప్రభుత్వం ఒంటరి మహిళలకు నెలకు రూ.2,016 పింఛన్‌ అందిస్తే అవసరాలకు ఎవరిమీద ఆధారపడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎన్నికల సమయంలో పింఛన్‌లు ఇస్తామన్నారు. దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదు. ఇంకెంతకాలం ఎదురుచూడాలి.

జిల్లాలో లబ్ధిదారులు 92,171

నెలకు చెల్లించాల్సిన మొత్తం రూ.21.63 కోట్లు

ప్రస్తుత పరిస్థితి జూన్‌ నుంచి బకాయి

దరఖాస్తు చేసిన వారు 9721

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని