logo
Updated : 09 Aug 2022 03:52 IST

గృహ కనెక్షన్‌తో వాణిజ్య కార్యకలాపాలా?

విభాగం మార్చుకోకపోతే భారీ బాదుడు తప్పదు
 తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: గృహ విద్యుత్తు కనెక్షన్‌ తీసుకుని వాణిజ్యం, కార్యాలయాల అవసరాల కోసం వినియోగిస్తున్నారా? వెంటనే కేటగిరీ మార్పించుకోండి. లేకపోతే చిక్కుల్లో పడతారు. తనిఖీల్లో దొరికితే మాత్రం బ్యాక్‌ బిల్లింగ్‌ బాదుడు తప్పదు. గ్రేటర్‌లో ఈ తరహాలో అక్రమంగా పెద్ద సంఖ్యలో కనెక్షన్లు ఉన్నాయని విద్యుత్తు పంపిణీ సంస్థ దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అలాంటి కనెక్షన్లను గుర్తించాలని ఇప్పటికే డిస్కం అధికారులను ఆదేశించింది.
విద్యుత్తు పంపిణీ సంస్థ వాణిజ్య నష్టాలపై గురిపెట్టింది. అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ప్రతి నెలా రూ.224 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌లోని సర్కిళ్లలోనే రావాల్సి ఉండటంతో ఆ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్‌గా ఏం చేయాలి? సాంకేతికతంగా ఏం చేస్తే ఆదాయ లోటును పూడ్చుకోవచ్చో స్పష్టంగా నిర్దేశించింది.

సైబర్‌ సర్కిల్లో..
* డిస్కంలో భారీగా ఆదాయం వచ్చే సర్కిళ్లలో సైబర్‌సిటీ ఒకటి. ఇక్కడ సిబ్బంది అలక్ష్యంతో బిల్లింగ్‌ కాకుండా కరెంట్‌ వాడుకుంటున్నట్లు గతంలో తనిఖీల్లో వెల్లడైంది. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నారు.
* అధికంగా కరెంట్‌ వాడుకున్న వినియోగదారులకు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మీటర్లను బిగిస్తుంటారు. వీటిని సీటీ మీటర్లు అంటారు. సైబర్‌సిటీలో రెండునెలల క్రితం 6,500 మీటర్లను తనిఖీ చేయగా.. 250 మీటర్లలో లోపాలు బయటపడ్డాయి. సీల్‌ వేయనివి, పనిచేయనివి, మీటర్‌ ఉన్నా బిల్లింగ్‌ తీయనివి ఇందులో ఉన్నాయి. ఇక్కడ జరిమానా విధించిన సొమ్ము కోట్లలోనే ఉంది.
* బహుళ అంతస్తుల భవనాలు సైతం ఇక్కడ ఎక్కువే. ప్రతి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. దాదాపు 17వేలకుపైగా ఇక్కడ ప్యానల్‌బోర్డులు ఉండగా ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో 200 కనెక్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
* విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరి సిబ్బందిపైనే వేటు వేశారు.
ఇతర ప్రాంతాల్లో..
* గృహ విభాగంలో ఎక్కువ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. విడిగా వంటగది లేకున్నా ఇస్తున్నారు. అక్కడే వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నారు. ఫలితంగా డిస్కం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఇలాంటివాటిని గుర్తించి అన్ని కలిపి ఒకటే కనెక్షన్‌ కిందకు మారుస్తున్నారు. నిబంధనల మేరకు బ్యాక్‌బిల్లింగ్‌ చేస్తున్నారు.

*తొలగించిన, బిల్లు నిలిపేసిన సర్వీసులను తనిఖీ చేయాలని నిర్ణయించారు. పెండింగ్‌ బిల్లులు కట్టకపోతే ఆ ప్రాంగణంలోని ఇతర కనెక్షన్లు తొలగించనున్నారు. ః వినియోగదారుడికి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చినా.. సకాలంలో బిల్లింగ్‌ చేయని సర్వీసులు చాలా ఉంటున్నాయి.  ఏఈ ప్రతినెలా వీటిని పరిశీలించి సకాలంలో బిల్లింగ్‌ చేసేలా చూడాలని డిస్కం ఆదేశించింది.

* మీటర్లకు ఐఆర్‌డీఏ సదుపాయం ఉన్నా మాన్యువల్‌గా ప్రతినెలా పెద్ద సంఖ్యలో బిల్లింగ్‌ చేస్తున్నారు. పాతబస్తీలో 3 వేల కనెక్షన్లను సర్వే చేస్తే లక్ష యూనిట్లు తేడా వచ్చింది. వినియోగదారులతో సిబ్బంది కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఐఆర్‌ విధానంలో మీటర్‌ రీడింగ్‌ తీయాలని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని