logo

గాంధీజీకి లోలాకులు ఇచ్చి..కాళ్లకు నమస్కరించా!

స్వాతంత్య్ర సంగ్రామ పరిచయం.. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం.. మహాత్ముడ్ని కళ్లారా చూడటం.. నిధుల సేకరణలో తన వంతు చేయూతనివ్వడం.. ఇలా ఎన్నో మధురస్మృతులు ఆమె సొంతం. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు నుంచి చీలిక వరకు..

Updated : 13 Aug 2022 07:09 IST

‘ఈనాడు’తో ఎస్‌వీకే ప్రసాద్‌ సతీమణి శాఖమూరి సుగుణ

శాఖమూరి సుగుణ

స్వాతంత్య్ర సంగ్రామ పరిచయం.. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం.. మహాత్ముడ్ని కళ్లారా చూడటం.. నిధుల సేకరణలో తన వంతు చేయూతనివ్వడం.. ఇలా ఎన్నో మధురస్మృతులు ఆమె సొంతం. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు నుంచి చీలిక వరకు.. స్వాత్రంత్యం సిద్ధించిన సమయం నుంచి వజ్రోత్సవం వరకు దేశగమనాన్ని చూశారు శాఖమూరి సుగుణ. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎస్‌వీకే ప్రసాద్‌ భార్య. ప్రస్తుతం 86 ఏళ్ల వయసు. కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంటున్నారు. స్వాతంత్య్రం రాకమునుపు.. వచ్చినప్పటి పరిస్థితులు, ప్రస్తుత విధానాలపై తన అనుభవాలు ‘ఈనాడు’తో పంచుకున్నారు.

మా సొంతూరు ఉమ్మడి నల్గొండ జిల్లా బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న బ్రాహ్మణపల్లి. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఎనిమిదేళ్ల వయసులో 1944లో 11వ ఆంధ్ర మహాసభలు భువనగిరిలో జరిగాయి. ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డికి మా అన్నయ్య కోదండరామిరెడ్డి శిష్యుడు. ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లాడు. నాటి ఆంధ్ర మహాసభల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డిని కలిశా.

అప్పుడే గాంధీజీని చూశా..

అప్పట్లో పూర్తిగా ఉర్దూ మీడియంలోనే చదువు ఉండేది. ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నా. స్వాతంత్య్రం రావడానికి కొన్ని నెలల ముందు గాంధీజీ ఒకసారి నిధుల సేకరణకు హైదరాబాద్‌ మీదుగా వెళుతున్నారని తెలిసింది. అక్కడ రైలు ఐదు నిమిషాలు ఆగుతుందని తెలిసింది. మా అన్నయ్య నన్నూ వెంట తీసుకెళ్లాడు. ఆ సమయంలో నారాయణరెడ్డి భార్య సీతాదేవి తన వద్ద ఉన్న బంగారం అంతా తీసి గాంధీజీకి ఇచ్చి కాళ్లకు నమస్కరించింది. ఆవిడ అలా చేయడం చూసి.. నాలోనూ తెలియకుండా ప్రేరణ కలిగింది. వెంటనే నా చెవి లోలాకులు తీసి గాంధీజీ చేతుల్లో పెట్టి కాళ్లకు నమస్కరించి వచ్ఛా అక్కడున్న ఎవరూ నాకు అడ్డు చెప్పలేదు. అలా చేసినందుకు అన్నయ్య ఎంతో సంతోషించారు.

రెండు జెండాలు ఎగుర వేసేవారు

ఊళ్లలో వినాయక చవితి ఉత్సవాలే దేశభక్తికి స్ఫూర్తినిచ్చేవి. నాకు ఊహ తెలిశాక ఏటా వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నిర్వహించేవారు. ఊళ్లో నిత్యం భజనలు చేయడంతోపాటు సారేజహాసే అచ్ఛా సహా దేశభక్తి గీతాలు పాడేవాళ్లం. దీనికి అన్నయ్యనే నేతృత్వం వహించారు. అప్పట్లో మువ్వన్నెల జెండా ఎగురవేయాలంటే భయపడేవారు. నిజాం జెండా ఎగురవేసి.. పక్కనే మువ్వన్నెల జెండా ఎగురవేసేవాళ్లు. స్వాతంత్య్ర వచ్చినప్పుడు మా కుటుంబమంతా నగరంలోనే ఉన్నా. రజాకార్లు అడ్డుకున్నా.. అక్కడక్కడ సంబరాలు జరిగాయి.

ఉపాధికి ప్రాధాన్యమివ్వాలి

ఇప్పటివరకు మూడు తరాలు చూశా. అప్పట్లో నిజాం పాలనలో చాలా నీచమైన పరిస్థితులు ఉండేవి. తర్వాత కమ్యూనిస్టు పార్టీ వచ్చినా.. చీలికలు చూశాను. విడిపోకుండా ఉండాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యావంతులు పెరిగినా.. నిరుద్యోగం తాండవిస్తోంది.    ----ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మియాపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని