logo

రెండింతల లోడు.. అతి తక్కువ ఖర్చు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏటా సగటున 250 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతోంది. సిటీ వరకు కరెంట్‌ను సరఫరా చేసే విద్యుత్తు తీగలేమో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వేసినవి. ఓవర్‌లోడ్‌తో కొన్ని ప్రాంతాల్లో అంధకారమయ్యే పరిస్థితి. పెరుగుతున్న

Updated : 19 Aug 2022 04:50 IST

ప్రత్యేక మిశ్రమలోహంతో చేసిన కండక్టర్ల వాడకం

5 లైన్లలో తీగలు మార్చిన ట్రాన్స్‌కో

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏటా సగటున 250 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతోంది. సిటీ వరకు కరెంట్‌ను సరఫరా చేసే విద్యుత్తు తీగలేమో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వేసినవి. ఓవర్‌లోడ్‌తో కొన్ని ప్రాంతాల్లో అంధకారమయ్యే పరిస్థితి. పెరుగుతున్న లోడును తట్టుకోవాలంటే సమాంతరంగా మరో లైను వేయాలి. నగరంలో అది సాధ్యమయ్యే పనికాదు. భూగర్భ కేబుల్‌కేమో 20-25 రెట్లు అధికంగా ఖర్చు అవుతుంది. దీనికి పరిష్కారంగా ఇప్పుడున్న కండక్టర్ల స్థానంలో రెండింతల అధిక లోడు తీసుకునే హెచ్‌టీఎల్‌ఎస్‌(హై టెంపరేచర్‌ లో సాగ్‌) కండక్టర్లను ట్రాన్స్‌కో గ్రేటర్‌ హైదరాబాద్‌లో వేస్తోంది. ప్రధానంగా సమస్యను గుర్తించిన 5 లైన్లలో ఇప్పటికే 200 కి.మీ. మేర పాత కండక్టర్లను తొలగించి వీటిని వేశారు. మరికొన్ని మార్చబోతున్నారు.

ఎక్కడెక్కడంటే..

* మామిడిపల్లి 400కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి శివరాంపల్లిలోని 220 కేవీ ఉపకేంద్రం వరకు ఉన్న 220 కేవీ ఓవర్‌హెడ్‌ లైన్లు మార్చారు.

* శంకర్‌పల్లి 400 కేవీ ఉపకేంద్రం నుంచి గచ్చిబౌలిలోని 400కేవీ ఉపకేంద్రం వరకు ఉన్న 220 కేవీ తీగలను మార్చేశారు.

* మల్కారం 400కేవీ ఉపకేంద్రం నుంచి షాపూర్‌నగర్‌ 220 కేవీ ఉపకేంద్రం వరకు పాత 220 కేవీ విద్యుత్తు తీగలను తొలగించి కొత్తగా ఓవర్‌హెడ్‌ తీగలను వేశారు.

* చాంద్రాయణగుట్ట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ఉన్న 132 కేవీ తీగలను హెచ్‌టీఎల్‌ఎస్‌తో మార్చారు.

* మేడ్చల్‌-షాపూర్‌నగర్‌ 132 కేవీ ఓవర్‌హెడ్‌ లైన్లను సైతం కొత్త కండక్టర్లతో మార్చారు.

విస్తీర్ణం పెరిగింది.. బరువు తగ్గింది: జగత్‌రెడ్డి, డైరెక్టర్‌ (టాన్స్‌మిషన్‌), ట్రాన్స్‌కో

ఇప్పుడున్న అల్యూమినీయం కండక్టర్‌ స్టీల్‌ రీఇన్‌ఫోర్సెడ్‌తో పోలిస్తే తీగ విస్తీర్ణం కూడా పెరిగింది. కార్బన్‌ కోర్‌ ఉపయోగంతో బరువు తగ్గి క్రాస్‌ సెక్షన్‌ పెరిగింది. మా పరీక్షలో 450 మెగావాట్ల వరకు ఈ తీగలు తట్టుకున్నాయి. 220 కేవీ ఒక్క కిలోమీటర్‌ దూరం వేయాలంటే రూ.25 కోట్ల వరకు ఖర్చయితే కొత్త కండక్టర్‌తో రూ.కోటి మాత్రమే అవుతోంది. హెచ్‌టీఎల్‌ఎస్‌ కండక్టర్లతో రూ.110 కోట్లతో పని చేయగా రూ.60 కోట్ల వరకు కేంద్రం గ్రాంట్‌ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని