logo

Hyderabad Police: 20 ఏళ్లనాటి వేలిముద్రతో ఆలం గ్యాంగ్‌ ఆటకట్టు

నాలుగైదు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోన్న  అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఝార్ఖండ్‌కు చెందిన సత్తార్‌ షేక్‌ (40), మహ్మద్‌ అసీదుల్‌ షేక్‌ (20)ను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.80 వేల నగదు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 07 Oct 2022 09:17 IST

సత్తార్‌ షేక్‌                    మహ్మద్‌ అసీదుల్‌ షేక్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగైదు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఝార్ఖండ్‌కు చెందిన సత్తార్‌ షేక్‌ (40), మహ్మద్‌ అసీదుల్‌ షేక్‌ (20)ను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.80 వేల నగదు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నేరెడ్‌మెట్‌ రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, అదనపు డీసీపీ లక్ష్మి, కుషాయిగూడ ఏసీపీ రష్మీ పెరుమాల్‌తో కలిసి సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.

ఝార్ఖండ్‌.. రాధానగర్‌: ఝార్ఖండ్‌లోని సాహెబ్‌ జిల్లా రాధానగర్‌ గ్రామం. బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉంది. అక్కడే పుట్టిపెరిగిన ఆలం.. తమ్ముడు సత్తార్‌ షేక్‌ (అలియాస్‌ సత్తా, అబ్దుల్లా షేక్‌, మోటు)తో కలిసి ‘ఆలంగ్యాంగ్‌’ను సిద్ధం చేశాడు. మహ్మద్‌ అసీదుల్‌, సయీద్‌, అష్రుల్‌, బద్రుద్దీన్‌, బీవుల్లా అందులో సభ్యులు. ఆలం జైలులో ఉండగా.. గతనెలలో ముఠాలోని మిగతా ఆరుగురు నగరానికి వచ్చి  ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో రూ.70 లక్షల విలువైన 432 సెల్‌ఫోన్లు చోరీ చేశారు.  దర్యాప్తు చేపట్టిన పోలీసులు 500 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్‌టీం డీఎస్పీ నందకుమార్‌ బృందం.. ఒక వేలిముద్రను గుర్తించింది. 3వేల మంది నేరస్థుల వేలిముద్రలతో పోల్చగా.. అది 20 ఏళ్ల క్రితం ఒక జువెనైల్‌ కేసులో పట్టుబడిన మైనర్‌దిగా నిర్దారణకు వచ్చారు. ఆ మైనరే ఇప్పటి సత్తార్‌. దీంతో అతని కోసం 10 ప్రత్యేక బృందాలు 5 రాష్ట్రాలకు చేరాయి.  రాధానగర్‌లో స్థానిక పోలీసుల సాయంతో 7 రోజులపాటు మకాం వేసి గతనెల 30న సత్తార్‌ను అరెస్ట్‌ చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌ బృందం పశ్చిమబెంగాల్‌ మాల్దా జిల్లాలో మహ్మద్‌ అసీదుల్‌ షేక్‌ను ఈనెల 2న అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై తీసుకొచ్చారు. పరారీలో ఉన్న సయీద్‌, అష్రుల్‌, భద్రుద్దీన్‌, బీవుల్లా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని