logo

Super star Krishna: మంజీరా నీళ్లు.. పచ్చ అరటిపండ్లు..

 సూపర్‌స్టార్‌ కృష్ణది హైదరాబాద్‌తో నాలుగు దశాబ్దాలకుపైగా అనుబంధం. ఆయన శాశ్వతంగా దూరమైనా.. ఇక్కడి గడ్డపై ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Updated : 16 Nov 2022 07:53 IST

చెమట పట్టని ఇక్కడి వాతావరణమంటే ‘కృష్ణ’కు ఇష్టం
నగరంతో నాలుగు దశాబ్దాలకుపైగా అనుబంధం


ట్యాంక్‌బండ్‌పై తెలుగుతల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌లతో కృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణది హైదరాబాద్‌తో నాలుగు దశాబ్దాలకుపైగా అనుబంధం. ఆయన శాశ్వతంగా దూరమైనా.. ఇక్కడి గడ్డపై ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో చెమట పట్టని వాతావరణమన్నా.. ఇక్కడ దొరికే అరటిపండ్లు .. మంజీరా నీళ్లన్నా ఆయనకు ఎంతో ఇష్టం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ భాగ్యనగరంలో స్థిరపడటానికి ముఖ్యమైన మూడు మూల స్తంభాల్లో ఆయన ఒకరు. పద్మాలయ స్టూడియో నిర్మాణం తర్వాత ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌లు హైదరాబాద్‌లో చేసేవారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ తరలిరావడానికి 70వ దశకం ఆఖరు, 80వ దశకం ఆరంభంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిల్మ్‌నగర్‌లో దాదాపు 150 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, స్వరాష్ట్రంలోనే తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో నాటి అగ్రహీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, ఇతర ప్రముఖులు 70వ దశకం ఆఖర్లో హైదరాబాద్‌ వచ్చేశారు. రామానాయుడు స్టూడియోస్‌కు వెళ్లే దారిలో కృష్ణ ఇల్లు కట్టుకున్నారు. అక్కడే చాలాకాలం ఉన్నారు. తర్వాత షూటింగ్‌కు ఇచ్చి.. ఇప్పుడు ఉంటున్న నానక్‌రాంగూడలోని నివాసానికి మారిపోయారు.  

ఇక్కడే స్టూడియో..

1982లో షేక్‌పేట్‌ మండలం ఫిల్మ్‌నగర్‌లో పద్మాలయ స్టూడియోస్‌ నిర్మించారు.  అత్యధికం ఇక్కడే షూటింగ్‌ చేసేవారు. ఆబిడ్స్‌ చౌరస్తాలో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరిగిన విషయాలను ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.  మద్రాస్‌లో సముద్రం ఉండటంతో ఎక్కువగా చెమటపట్టేది. హైదరాబాద్‌లో అప్పట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. చెమట పట్టేది కాదు. ఇది కృష్ణకి ఎంతగానో నచ్చేది. హైదరాబాద్‌లో దొరికే పెద్ద పచ్చ అరటిపండ్లు ఆయనకు అమితంగా ఇష్టం.  నగరానికి సరఫరా చేసే మంజీరా మంచినీరన్నా.. ఇక్కడ ఏడాది పొడవు దొరికే మొక్కజొన్న పొత్తులన్నా ఆయన ఎంతో ఇష్టపడేవారు. సింహాసనం సినిమా ఆ రోజుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 18 థియేటర్లలో విడుదలైంది.  అప్పట్లో ఇదొక రికార్డు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని