logo

అవసరం తీరిందని అలుసా!

నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక కట్టడం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. పునరుద్ధరణకు నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు.

Published : 29 Nov 2022 04:37 IST

గోల్డెన్‌ త్రిషోల్డ్‌ భవనం పునరుద్ధరణపై నిర్లక్ష్యం


అబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనం

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక కట్టడం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. పునరుద్ధరణకు నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అబిడ్స్‌లో కొనసాగుతున్న గోల్డెన్‌ త్రిషోల్డ్‌ భవనం దుస్థితి ఇది.

ఘన చరిత.. స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు నివాసమైన ఈ భవనం 1.66 ఎకరాల్లో ఉంది. 1900 సమయంలో ఇండో-యూరోపియన్‌ నిర్మాణ శైలితో నిర్మించారు. వెనక ఉన్న మరో భవనంలో పేదలకు వైద్యం అందించేందుకు గోపాల్‌ క్లినిక్‌ నిర్వహించేవారు. ఈ రెండు భవనాలను వారసత్వ సంపదగా ప్రభుత్వం గుర్తించింది. ఇదే భవనంలో 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హెచ్‌సీయూను ప్రారంభించారు. 1988లో వర్సిటీని గచ్చిబౌలి సమీపంలోని క్యాంపస్‌కు తరలించే వరకు తరగతులు ఇక్కడే నడిచాయి. 2003 వరకు వర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం కొనసాగింది. ప్రధాన భవనం ప్రస్తుతం ఖాళీగా శిథిలావస్థలో ఉంది. వెనక గోపాల్‌ క్లినిక్‌దీ అదే పరిస్థితి. మరో భవనంలో వర్సిటీ దూరవిద్య కేంద్రం కొనసాగుతోంది.

ఆగస్టులోనే ప్రకటించినా.. మూడేళ్ల కిందట వర్సిటీకి శ్రేష్ఠ హోదా దక్కడంతో రూ.5 కోట్లతో గోల్టెన్‌ త్రిషోల్డ్‌ భవన పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. మూడేళ్లయినా పనులకు అతీగతీ లేదు. ఆగస్టులో కేంద్ర ప్రజా పనుల విభాగం(సీపీడబ్ల్యూడీ)కి పనులను అప్పగిస్తూ వర్సిటీ నిర్ణయించినా ప్రారంభం కాలేదు. ఇటీవల వర్సిటీ అధికారులు, ఇన్‌టాక్‌, సీపీడబ్ల్యూడీ విభాగం ప్రతినిధులు భవనాన్ని పరిశీలించారు. ‘ఇన్‌టాక్‌తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి’’ అని హెచ్‌సీయూ అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని