logo

బరితెగించిన దోపిడీ దొంగలు

రాజధానిలో దోపిడీ దొంగలు బరి తెగించారు. నాగోల్‌ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

Updated : 02 Dec 2022 06:37 IST

నాగోలులో కాల్పులు.. బంగారం అపహరణ

గాయపడిన యజమాని కళ్యాణ్‌, వ్యాపారి సుఖ్‌దేవ్‌

ఈనాడు- హైదరాబాద్‌, కొత్తపేట, నాగోల్‌, న్యూస్‌టుడే: రాజధానిలో దోపిడీ దొంగలు బరి తెగించారు. నాగోల్‌ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనలో బంగారం వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు. దుకాణం యజమాని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గురువారం పొద్దుపోయాక జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

రెండు రౌండ్ల కాల్పులు

రాజస్థాన్‌లోని పాలీ జిల్లా జైతరణ్‌ తహసీల్‌కు చెందిన కల్యాణ్‌ చౌదరి వనస్థలిపురంలో ఉంటూ చైతన్యపురి ఠాణా పరిధిలోని స్నేహపురి కాలనీలో మహదేవ్‌ జ్యుయెలర్స్‌ పేరిట  ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో దుకాణం మూసేయడానికి సిద్ధమవుతుండగా.. ఆభరణాల వ్యాపారి రాజ్‌కుమార్‌ సురానా సుఖ్‌దేవ్‌ సికింద్రాబాద్‌ నుంచి బంగారం తీసుకొచ్చాడు. అప్పటికే ఆభరణాలు కొనేందుకు వచ్చిన ముగ్గురు వినియోగదారులు కల్యాణ్‌ చౌదరితో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలు దుకాణానికి కొద్ది దూరంలో నిలిపారు. అందులో ఇద్దరు నడుచుకుంటూ వచ్చి అకస్మాత్తుగా దుకాణంలోకి ప్రవేశించారు. ఒకరు హెల్మెట్‌, మరొకరు మాస్క్‌ ధరించి ఉన్నారు. అందులో ఒకరు దేశవాళీ తుపాకీతో బెదిరిస్తూ దుకాణంలో ఉన్న ముగ్గురు వినియోగదారుల్ని బయటకు నెట్టేసి షట్టర్‌ మూసేశారు. వ్యాపారి సుఖ్‌దేవ్‌ తీసుకొచ్చిన బంగారం, దుకాణంలోకి కొన్ని ఆభరణాలను ఇవ్వాలంటూ బెదిరించారు. నలుగురి మధ్య పెనుగులాట జరిగింది. లాభం లేక రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. సుఖ్‌దేవ్‌కు చెవి, భుజం దగ్గర రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. కల్యాణ్‌కు ముక్కు దగ్గర బుల్లెట్‌ గాయాలయ్యాయి.

బంగారంతో పరార్‌..

దుండగులు లోపలికి వెళ్లాక ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో బయట నిలబడ్డ ముగ్గురు కస్టమర్లు షెట్టర్‌ తెరిచారు. ఇద్దరు దుండగులు  బంగారం సంచి, దుకాణంలో నగదు లాక్కుని  మిగతా ఇద్దరు వ్యక్తులతో కలిసి ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. అంతా రెండు నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. స్థానికులు తేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. వెంబడించినా ప్రయత్నం లేకపోయింది. బంగారం ఎంత దోపిడీ చేశారనేది తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని   ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు.

గురువారం తెస్తున్నారని..

వ్యాపారి సుఖ్‌దేవ్‌ ప్రతి గురువారం కల్యాణ్‌ దుకాణానికి వచ్చి బంగారం ఇస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిందితులు సుఖ్‌దేవ్‌ను అనుసరించి దోపిడీకి పాల్పడ్డారు.  పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు.  అధికారులతో 15 బృందాలు ఏర్పాటు చేశారు.  రాచకొండ అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబు, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పారిపోతున్న దుండగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని