సంక్షిప్త వార్తలు
శాసనసభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నవంబరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నందున ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.లోకేష్ కుమార్ శనివారం అన్నారు.
ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నవంబరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నందున ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.లోకేష్ కుమార్ శనివారం అన్నారు. రాష్ట్రస్థాయి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులకు (డిప్యూటీ తహసీల్దార్లకు) రెండు రోజుల శిక్షణ ముగింపులో ఆయన పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్‌ల అంశాలపై డెంప్ (డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్) ఉండాలని సూచించారు. ఎం.సి.సి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తనా నియమావళి), ఎం.సి.ఎం.సి (మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ), స్ట్రాంగ్ రూమ్స్, విజిలెన్స్ టీమ్స్, కంట్రోల్ రూమ్‌పై అవగాహన ఉండాలన్నారు. సీఈవో ఐ.టి సెక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.చిరంజీవులు డిప్యూటీ సీఈఓ సత్యావతి, ఏఎస్‌ఓ పాండు రంగారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సయ్యద్ ఆరిఫ్, రిసోర్స్ పర్సన్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాలో అంతరాయం 8, 9న
ఈనాడు, హైదరాబాద్: ఖానాపూర్ ప్రాంతంలోని కోకాపేట్ మైహోం అవతార్ వద్ద నీటి పైపునకు లీకేజీ కావడంతో మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 8న ఉదయం 6 నుంచి 9న ఉదయం 6 వరకు (24 గంటలపాటు) తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటనలో తెలిపింది. మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీలు, షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలో ప్రాంతాల్లో సరఫరా ఉండదు. ఈ నేపథ్యంలో షేక్‌పేట్, టోలీచౌకి, గొల్కొండ, చింతల్‌బస్తీ, విజయనగర్‌కాలనీ, గండిపేట, కోకాపేట్, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల ప్రాంతాల్లో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు వివరించింది.
మందుబాబులపై కొరడా
నారాయణగూడ, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై నగర పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జనవరిలో 4,236 మందిపై కేసు నమోదు చేశారు. 3,680 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసి 3, 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులలో ప్రవేశపెట్టారు. 365 మందికి జైలు శిక్ష విధించగా, 3,315 మందికి జరిమానా విధించారు. వారంతా రూ.94,16,560 చెల్లించారు. మరో 556 మందిని త్వరలో కోర్టులో ప్రవేశపెడతామని అదనపు సీపీ (ట్రాఫిక్) సుధీర్‌బాబు ప్రకటనలో తెలిపారు.
నుమాయిష్‌లో ‘వెల్ బేబీ షో’ నేడు
అబిడ్స్, న్యూస్‌టుడే: నుమాయిష్‌లో ఈనెల 5 (ఆదివారం)న ‘వెల్ బేబీ షో’ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్‌మార్గం తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటినరీ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వెల్ బేబీ షోలో మూడేళ్ల లోపు చిన్నారులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ చిన్నారులతో రావాలని కోరారు. ఎగ్జిబిషన్ సొసైటీ, యశోద ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తోన్న వెల్ బేబీ షోను సొసైటీ తరఫున కార్యదర్శి సాయినాథ్ దయాకర్‌శాస్త్రి, సబ్ కమిటీ సలహాదారు డా.జీఎస్ శ్రీనివాస్, కన్వీనరు డా.ఎన్.సంజీవరావు పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.
బల్మూరి వెంకట్‌ను విడుదల చేయాలంటూ దీక్ష
ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ముట్టడి సందర్బంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అరెస్ట్ చేసి 24గంటలు అవుతున్నందున వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నందకిషోర్ డిమాండ్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ శనివారం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులు మౌన దీక్ష చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విప్లవ్, అక్షయ్, రాకేష్, సుమంత్, మహేష్, ప్రభాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్త అదనపు జిల్లా జడ్జీలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తుల ఖాళీలను పూరిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్బీనగర్‌లోని జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు జడ్జిగా జి.బి.చంద్ర, నాలుగో అదనపు సెషన్స్ జడ్జిగా న్.సంతోష్‌కుమార్, 12వ అదనపు సెషన్స్ కోర్టుకు పంచాక్షరి రానున్నారు. మల్కాజిగిరి ఒకటో అదనపు సెషన్స్ కోర్టు జడ్జిగా మిర్యాలగూడ నుంచి ఆర్.రఘునాథ్‌రెడ్డి వచ్చారు. ఇటీవల నూతనంగా అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైన సీహెచ్.చంద్ర కిషోర్‌ను వికారాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జిగా నియమించారు.
వసంత రాజీయం నాటక ప్రదర్శన నేడు
ఆర్కేపురం: ఆర్కేపురంలోని చిత్రా లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం వసంత రాజీయం(లకుమాదేవి) పద్యనాటక ఉచిత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మురళీ కృష్ణ, సాంస్కృతిక కళాసంఘం అధ్యక్షుడు సోమ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టయ్యలు తెలిపారు. శనివారం విలేకరులతో ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, చలన చిత్రాభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సభాధ్యక్షురాలిగా ఎస్వీ భారతి, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, పేరాల శేఖర్‌రావు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఎం.అంజిరెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, హనుమంత్‌రావు పాల్లొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక