logo

అవసరమైతేనే అదనపు స్టేషన్లు

మెట్రో మొదటిదశలో స్టేషన్ల నిర్మాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండోదశ ప్రాజెక్ట్‌ డిజైన్లలో కీలక మార్పులు చేస్తున్నారు.

Published : 06 Feb 2023 03:57 IST

విమానాశ్రయ మెట్రో మార్గం డిజైన్‌లో కీలక మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో మొదటిదశలో స్టేషన్ల నిర్మాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండోదశ ప్రాజెక్ట్‌ డిజైన్లలో కీలక మార్పులు చేస్తున్నారు. తొలిదశలో సగటున కిలోమీటర్‌కు ఒక మెట్రోస్టేషన్‌ ఉండేలా నిర్మించారు. నిజానికి సగం స్టేషన్లకు ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రమే. కాలనీలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీటిని నిర్మించారు. అయితే ఈసారి భవిష్యత్తులో ప్రయాణికుల డిమాండ్‌ ఆధారంగా అదనంగా స్టేషన్లను నిర్మించుకునేలా డిజైన్‌ చేసుకుంటే నిర్మాణ వ్యయం, నిర్వహణ ఇబ్బందులు తప్పుతాయని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భావిస్తోంది. దీంతో రాయదుర్గం-శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రోలో మార్పులపై కసరత్తు చేస్తోంది. విమానాశ్రయానికి 26 నిమిషాల్లో చేరుకునేలా దీనికి డిజైన్‌ చేశారు. దీంతో చాలా పరిమితంగా స్టేషన్లు ఉంటాయి. బయోడైవర్సిటీ కూడలి సమీపంలో మొదటి స్టేషన్‌ వస్తుంది. ఆ తర్వాత ఖాజాగూడ, నానక్‌రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, విమానాశ్రయ కార్గో, విమానాశ్రయ టర్మినల్‌ ఇలా సగటున 4 కి.మీ.కు ఒక స్టేషన్‌ వస్తుంది.


నివాసాలు పెరుగుతున్నాయ్‌..

బాహ్య వలయ రహదారి సర్వీసు రహదారి గుండా మెట్రో రానుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆకాశహర్మ్యాలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఒక్కో కమ్యూనిటీలో 3, 4 వేల నివాసాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇప్పుడు ప్రతిపాదించిన ఏడెనిమిది స్టేషన్లు ఇప్పటి, సమీప అవసరాలకు తీరుస్తాయి. పదేళ్ల తర్వాత 2 కి.మీ.కు ఒక స్టేషన్‌ అవసరం పడొచ్చు. అందుకే భవిష్యత్తులో అవసరమైన చోట కొత్తగా స్టేషన్లను నిర్మించుకునేలా తుది అలైన్‌మెంట్‌ రూపకల్పనపై అధికారులు దృష్టిపెట్టారు. దీనిపై ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని