logo

కోట్లు కుమ్మరించినా మారని సాగర్‌ దుస్థితి

నిపుణుల సూచనలు పట్టవు.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలు పాటించరు.. మురుగుకు అడ్డుకట్ట వేయరు.. ఫలితంగా హుస్సేన్‌సాగర్‌ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది.

Published : 21 Mar 2023 02:46 IST

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు అమలయ్యేదెన్నడు?

ఈనాడు, హైదరాబాద్‌: నిపుణుల సూచనలు పట్టవు.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలు పాటించరు.. మురుగుకు అడ్డుకట్ట వేయరు.. ఫలితంగా హుస్సేన్‌సాగర్‌ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. ప్రక్షాళన పేరుతో రూ.కోట్లు కుమ్మరిస్తున్నా బయోరెమిడేషన్‌తో ఆక్సిజన్‌ స్థాయిలో మాత్రం పురోగతి కనిపించడం లేదు.  ఫలితంగా దుర్వాసన, గుర్రపుడెక్క పెరిగిపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.


ఎన్జీటీ ఆదేశాలివీ..

* హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవడం, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియను పట్టణాభివృద్ధిశాఖ, అదనపు ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని సంయుక్త కమిటీ పర్యవేక్షించాలని  జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ కమిటీ నెలలోపు సమావేశమై 6 నెలల ప్రణాళికను సిద్ధం చేయాలని జులై 6న స్పష్టం చేసింది. ఇప్పటివరకు కమిటీ సమావేశమైన దాఖలాలు లేవు.
* 5 ఫీడర్‌ ఛానళ్ల ద్వారా 376.5 ఎంఎల్‌డీల వ్యర్థాలు చేరుతున్న నేపథ్యంలో నీటి నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కూకట్‌పల్లి డ్రెయిన్‌ ద్వారా కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు నిలుపుదల చేయాలి. ప్రతినెలా సమావేశమవుతూ పరిస్థితిని సమీక్షిస్తూ ఆ నిర్ణయాలను స్టేట్‌ వెట్‌లాండ్‌ అథారిటీ వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది.


బీవోడీ పెరిగితే కాలుష్యం పెరిగినట్టే..

వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకర బ్యాక్టీరియాలు పెరిగేందుకు ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా సాగర్‌లో చల్లుతున్నారు. చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధికి బొకాషీబాల్స్‌ వేస్తున్నప్పటికీ ఆక్సిజన్‌ శాతంలో పెద్దగా మార్పు రావడం లేదు. ఇటీవల పీసీబీ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించగా ఆరుచోట్ల డీవో సున్నాగా నమోదైంది. పీసీబీ లెక్కల ప్రకారం.. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) 3 ఎంజీలకంటే తక్కువ ఉండాలి. అయితే 9 ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువగా నమోదైంది.


సాగర్‌ ప్రక్షాళనకు పెట్టిన ఖర్చు.. రూ.400 కోట్లు

2006 - రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు
2014 - రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్‌ పనులు
2015 - జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 8 కాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాల తొలగింపు
2017, 2018, 2019, 2021 - హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్‌ కంపెనీ శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ వినియోగం.


ఇప్పటికీ కమిటీ ఏర్పాటవ్వలేదు
- లుబ్నా సారస్వత్‌, సామాజిక ఉద్యమకారిణి

ఎన్జీటీ ఆదేశాలు అమలు కాలేదు. హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణపై కేసు వేయగా ఎన్జీటీ ఏడేళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిపై వివాదాలున్నాయి. 10 ఎకరాల ఆక్రమణ కేసు హైకోర్టులో నడుస్తోంది. హుస్సేన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి.

ఓ వైపు కోట్లతో సాగర్‌ ప్రక్షాళన చేస్తుండగా నాలాల్లో పూడిక, చెత్త పేరుకుని వర్షానికి కొట్టుకుని రావడం పరిపాటి అయింది. మూడు రోజులనుంచి కురుస్తున్న వర్షానికి మళ్లీ చెత్త చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని