logo

పండగ వేళ అప్రమత్తతే అస్త్రం: సీవీ ఆనంద్‌

వరుస పండగలు, ఊరేగింపుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు.

Published : 22 Mar 2023 02:10 IST

మాట్లాడుతున్న సీపీ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: వరుస పండగలు, ఊరేగింపుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై రెచ్చగొట్టే ప్రకటనలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు. ఒకే నెలల్లో రంజాన్‌ మాసం, శ్రీరామనవమి, హనుమజ్జయంతి పండగలు రావటంతో పోలీసు అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీపీ దిశానిర్దేశం చేశారు. మంగళవారం బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం నుంచి ఇన్‌స్పెక్టర్లు, బ్లూకోట్స్‌, కీలకమైన విభాగాలు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఉత్సవాలు, ఊరేగింపు సమయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. ప్రార్ధనా మందిరాలు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సెక్టార్‌ వారీగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను గుర్తించి కట్టడి చేపట్టాలన్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి అసత్య ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అర్హత గల వారితో వెంటనే శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతిభద్రతల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసులు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ వారీగా కీలకమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ కలసికట్టుగా సమన్వయంతో మెలగాలని సూచించారు. నగర అదనపు సీపీ (శాంతి భద్రతలు) విక్రమ్‌సింగ్‌ మాన్‌, ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీలు డాక్టర్‌ గజరావు భూపాల్‌, పరిమళ హననూతన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని