logo

ఆ భూములు ప్రభుత్వానివే: హైకోర్టు

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నం.46లోని 84.30 ఎకరాలు ప్రభుత్వానివేనని శుక్రవారం హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 25 Mar 2023 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నం.46లోని 84.30 ఎకరాలు ప్రభుత్వానివేనని శుక్రవారం హైకోర్టు తేల్చి చెప్పింది. వివాదాస్పద భూములు కొన్న ఎం.రాములు మరో 13మంది దాఖలుచేసిన అప్పీలుపై విచారించిన జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ తీర్పు వెలువరించారు. ఈ భూములు ప్రభుత్వానివేనంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాములు తదితరుల అప్పీలును కొట్టివేశారు. పైగా గ్రామంలో సర్వే నంఎ.46లో వలీలుల్లా హుస్సేన్‌కు ఆర్డీవో పట్టా మంజూరుచేయగా, జాయింట్‌ కలెక్టర్‌ రద్దు చేశారు. జేసీ ఉత్తర్వులను రద్దుచేసిన రెవెన్యూ బోర్డు, దీనిపై విచారించి తిరిగి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 1968లో ప్రొసీడింగ్స్‌ జారీ చేసి విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిగా తేల్చారు. దీనిపై వల్లీలుల్లా హుస్సేన్‌ రెవెన్యూ బోర్డును ఆశ్రయించినా జేసీ ఉత్తర్వులను సమర్థించింది. అనంతరం కింది కోర్టులు కూడా సమర్థించగా వివాదం హైకోర్టుకు చేరింది. వల్లీలుల్లాతోపాటు అతని నుంచి కొనుగోలు చేసిన ఎం.రాములు తదితరుల అప్పీళ్లను హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును రద్దుచేస్తూ తిరిగి విచారణ చేపట్టాలని వెనక్కి పంపింది. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని