logo

ఆలకించండి.. పరిష్కరించండి

సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో విన్నపాలు సమర్పించడం పరిపాటి. అలాకాకుండా అధికారులే స్వయంగా అర్జీలు స్వీకరించేందుకు జిల్లాలో ప్రతి సోమవారం ‘ప్రజా వాణి’ కార్యక్రమం జరుగుతోంది.

Published : 28 Mar 2023 02:57 IST

‘ప్రజావాణి’కి పలు సమస్యలతో వచ్చిన పేదలు
అధికారులకు వివరణలు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి, వికారాబాద్‌, తాండూరు

సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో విన్నపాలు సమర్పించడం పరిపాటి. అలాకాకుండా అధికారులే స్వయంగా అర్జీలు స్వీకరించేందుకు జిల్లాలో ప్రతి సోమవారం ‘ప్రజా వాణి’ కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఇది కేవలం కలెక్టరేట్‌కే పరిమితం కాగా, కొంతకాలం నుంచి మండల స్థాయిలోనూ నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగిన ప్రజావాణికి వచ్చినవారి బాధల గాథలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


తక్కువగా నమోదు

కుల్కచర్ల మండలం ఘనాపూర్‌ గ్రామానికి చెందిన చీపుర్తి రాములు, మల్లయ్య, అంబయ్య ముగ్గురూ  అన్నదమ్ములు. 3 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. ధరణి వచ్చిన తరువాత అధికారులు ఇచ్చిన ఆర్డర్‌ ప్రతిలో 3 ఎకరాల 12 గుంటలుగా నమోదైంది. పాస్‌బుక్‌లో మాత్రం ఎకరం 26 గుంటలుగా నమోదు చేశారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినట్లు అంబయ్య తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావటంలేదన్నారు. 2022 జనవరిలో పొలంలో పనిచేస్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్‌ అదుపు తప్పి ఇతని నుంచి పోయింది. దీంతో ఒక పక్క కాలు, చేయి శరీరం దెబ్బతిందని తిరగలేక పోతున్నాని అధికారులు పరిష్కరించాలని కోరారు.  


అంబడి బదులుగా లంబడితో అవస్థ

నా పేరు అంబడి సునీత. మాది శంకర్‌పల్లి మండలం భానూర్‌ గ్రామం. 2005లో మోమిన్‌పేట మండలం టేకులపల్లిలో సర్వే నంబర్‌ 365/ఆ లో ఎకరం భూమి ఖరీదు చేశాను. ఇదే పేరుపైన పాత పాస్‌బుక్‌ జారీ చేశారు. ధరణి వచ్చిన తర్వాత నా పేరు అంబడి బదులుగా లంబడి అని తప్పుగా నమోదైంది. ఇంటిపేరు మార్చాలని ఎన్నోసార్లు మోమిన్‌పేట మండల తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి మొరపెట్టుకున్నా. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అసలే దీర్ఘకాలిక  వ్యాధితో బాధపడుతున్నా.


ఇతరుల భూమిని కలిపారు

మా అమ్మ పేరు బాసారం సావిత్రమ్మ. అమె పేరుపైన వికారాబాద్‌ మండలం గిరిగిట్‌పల్లిలో సర్వే నంబర్‌ 41లో 26 గుంటల వ్యవసాయ భూమి ఉందని కొడుకు బాసారం రవి తెలిపారు. మా భూమి సర్వే నంబర్‌లో 3.33 ఎకరాలు ఇతరుల భూమిని కలిపారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఎన్నోసార్లు తహసీల్దారు కార్యాలయంలో అర్జీలు ఇచ్చాం. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలని రవి కోరుతున్నారు.  


పింఛను పెరిగింది.. పేర్లు తొలగాయి

ధారూర్‌ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సాయిరెడ్డి (75) సాయిలు (68) నర్సింహులు (68)కు అయిదేళ్ల క్రితం వరకు వృద్ధాప్య పింఛను పంపిణీ చేశారు. తరువాత ఆపేశారు. ఇదేంటని అధికారులను అడిగితే అధికారులే తొలగించారని అంటున్నారు. మాకు తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. భూమి కూడా 3 ఎకరాల కంటే తక్కువగా ఉంది. పూర్తిగా నిరుపేదలం. పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని