logo

ఒక రోజు ఆగితే.. వారంపాటు ప్రభావం!

గ్రేటర్‌ వ్యాప్తంగా తరచూ ఆర్టీఏ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. రోజంతా సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సెంట్రల్‌ సర్వర్లు మొరాయించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం వైపు ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు.

Published : 07 Jun 2023 04:11 IST

 తరచూ మొరాయిస్తున్న సర్వర్లు
గ్రేటర్‌ ఆర్టీఏ సేవల్లో తీవ్ర ఇబ్బందులు

గ్రేటర్‌ వ్యాప్తంగా తరచూ ఆర్టీఏ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. రోజంతా సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సెంట్రల్‌ సర్వర్లు మొరాయించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం వైపు ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. తెలంగాణలో సగానికిపైగా ఆర్టీఏ కార్యకలాపాలు హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి పరిధిలోని ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, కొండాపూర్‌, ఉప్పల్‌, మలక్‌పేట్‌, సికింద్రాబాద్‌, బండ్లగూడ కార్యాలయాల్లో ఈ-సేవలు అందిస్తున్నారు. దాదాపు 80 లక్షల వాహనాలుండగా నిత్యం 2500 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్‌ లైసెన్సుల నుంచి వాహనాల రిజిస్ట్రేషన్‌ వరకు దాదాపు 56 రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం ఉంది. ఆయా కార్యాలయాల పరిధిలో నిత్యం 6-7 వేల రకాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. సర్వర్ల డౌన్‌తో ఎప్పటికప్పుడు ఈ-సేవలు నిలిచిపోవడం వల్ల ఆ ప్రభావం వారంరోజులపాటు ఉంటోందని సిబ్బంది వాపోతున్నారు. ఒక రోజు నిలిచిపోవడం వల్ల ఆ స్లాట్‌లన్నీ రెండోరోజు లేదంటే తర్వాత రోజు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ రోజు వచ్చిన కొత్త స్లాట్లు కేటాయింపు తక్కువ చేయడం ద్వారా కనీసం వారం రోజులపాటు ఆయా కార్యాలయాల వద్ద రద్దీ ఏర్పడుతోంది. చాలామంది కార్యాలయాలకు సెలవు పెట్టి, పనులు వాయిదా వేసుకొని వస్తుంటారు. తీరా కార్యాలయాలకు చేరుకున్న తర్వాత సర్వర్‌ పనిచేస్తుందో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

కారణం అదేనా...?

రవాణాశాఖ మూడంచెల సేవలకు ప్రత్యేకంగా సర్వర్లు నిర్వహిస్తోంది. అయితే ఈ-సేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌(టీఎస్‌టీఎస్‌) ఐటీ సేవలను అందిస్తోంది. స్లాట్‌ బుకింగ్‌ ఇతర వివరాలను ఆర్టీఏ ఈ-సేవ సర్వస్‌ నుంచి సమాచారం పొందుతోంది. అయితే టీఎస్‌టీఎస్‌ సర్వర్‌లో సాంకేతిక లోపాలు కారణంగా ఆ ప్రభావం ఈ-సేవ సేవలపై పడుతోంది. తద్వారా ఆర్టీఏ సేవలకు కూడా ఆటంకం వాటిల్లుతోంది. దీంతో చాలామందికి స్లాట్లు బుక్‌ కావడం లేదు. ఆన్‌లైన్‌లో చెల్లించే రుసుములు కూడా ఫెయిల్‌ అవుతున్నాయి. కొన్నిసార్లు ఒక్కో సేవ కోసం రెండు, మూడు రోజులపాటు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని చెబుతున్నారు. ప్రతి కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఈ సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో ఈసేవా కేంద్రాలకు సంబంధించి సర్వర్లలో లోపాలను సరిదిద్దాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. సాధారణ రోజుల్లో గంటలో అయ్యే పనికోసం ప్రస్తుతం నాలుగైదు గంటలుపాటు నిరీక్షణ తప్పదు. కొందరైతే నిరీక్షించలేక తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ ఇబ్బందులు పడలేక బుక్‌చేసిన స్లాట్లను విడిచి పెట్టి మళ్లీ కొన్ని రోజుల తర్వాత వస్తున్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యలు కారణంగా సేవల్లో జాప్యం జరిగితే స్లాట్లను తర్వాత రోజుల లేదంటే మరో రోజుకు పొడిగిస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వాహనదారులు స్లాట్లు వదులుకొని నష్టపోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు సర్వర్లు పనిచేయక పోవడంతో ఇదే అదనుగా దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని