logo

సెప్టెంబరులోపు విమానాశ్రయ మెట్రో పనులు

విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులను సెప్టెంబర్‌ నాటికి ప్రారంభించాలని, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఎంఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Published : 15 Jun 2023 02:21 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులను సెప్టెంబర్‌ నాటికి ప్రారంభించాలని, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఎంఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. బుధవారం బేగంపేట్‌లోని మెట్రో రైల్‌ భవన్‌లో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించగా పాల్గొన్న బిడ్డర్లకు ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసేందుకు ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశంలో 13 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో ఎల్‌అండ్‌టీ, అల్‌స్టోమ్‌, సీమెన్‌, టాటా ప్రాజెక్ట్స్‌, ఇర్కాన్‌, ఆర్‌వీఎన్‌ఎల్‌, బీఈఎంఎల్‌, పాండ్రోల్‌ సంస్థలున్నాయి. సర్వే, పెగ్‌మార్కింగ్‌, అలైన్‌మెంట్‌ ఫిక్సేషన్‌ తదితర ప్రాథమిక పనులు చాలా వరకు పూర్తయ్యాయని, భూసార పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఓ భూగర్భ మెట్రో స్టేషన్‌ సహా మొత్తం 9 స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. సివిల్‌ నిర్మాణాలు, రోలింగ్‌స్టాక్‌(రైళ్లు), సిగ్నలింగ్‌, రైలు నియంత్రణ వ్యవస్థలు, పనితీరు సూచికలు, సాంకేతిక లక్షణాలు మొదలైన వాటికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు వ్యయం రూ.6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. హెచ్‌ఎండీఏ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు 10 శాతం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుందని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. హెచ్‌ఏఎంఎల్‌ సలహాదారు సుబోధ్‌ జైన్‌, చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డి.వి.ఎస్‌.రాజు, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ బి.ఆనంద్‌ మోహన్‌, జీఎం ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఈ సాయపరెడ్డి, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ జేఎన్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని