logo

Hyderabad Airport Metro: మూడేళ్ల అనుభవం.. 30 కి.మీ. తప్పనిసరి

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్ట్‌ టెండరు నిబంధనల రూపకల్పనలో మెట్రో వర్గాలు పకడ్బందీగా వ్యవహరించాయి.

Updated : 28 Jun 2023 09:08 IST

పకడ్బందీగా విమానాశ్రయ మెట్రో టెండరు నిబంధనలు 

 

ఈనాడు, హైదరాబాద్‌: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్ట్‌ టెండరు నిబంధనల రూపకల్పనలో మెట్రో వర్గాలు పకడ్బందీగా వ్యవహరించాయి. హైదరాబాద్‌ విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో(హెచ్‌ఏఎంఎల్‌) సంస్థ విధించిన షరతులు కఠినంగా ఉన్నాయని.. బిడ్డింగ్‌కు అర్హత సాధించే సంస్థలు తక్కువగా ఉంటాయని ఇన్‌ఫ్రా సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. బిడ్‌లో పాల్గొనాలంటే ఇది వరకు 30 కి.మీ. మెట్రో రైలు పనులు చేపట్టిన అనుభవం ఉండాలి. పనులను దక్కించుకున్నాక.. సివిల్‌ వర్క్స్‌ను సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు అనుమతి లేదు. మెట్రో ఆపరేషన్స్‌లో కనీసం మూడేళ్ల అనుభవం అవసరం. పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయకపోతే రూ.500 కోట్లు జరిమానా చెల్లించాలనే నిబంధనలను హెచ్‌ఏఎంఎల్‌ నిర్దేశించింది.

సిగ్నలింగ్‌, టెలి కమ్యూనికేషన్‌, రోలింగ్‌ స్టాక్‌ వంటి పనులు మూడో పక్షానికి అప్పగించినా.. పూర్తి బాధ్యత టెండర్‌ దక్కించుకున్న సంస్థదే. ఇటీవల జరిగిన ప్రీ బిడ్‌ సమావేశంలో పాల్గొన్న 13 సంస్థలు, కన్సార్షియంలు వీటిపై అనేక సందేహాలు లెవనెత్తాయి. రూ.2 లక్షలు చెల్లించి టెండర్‌ దరఖాస్తు పొందిన సంస్థలన్నీ ఈ సమావేశానికి వచ్చాయి. కఠిన నిబంధనల కారణంగా బిడ్‌ వేసే సంస్థలెన్ని అనేది ఆసక్తిగా మారింది. ప్రాజెక్ట్‌ వ్యయం రూ.6,250 కోట్లు కాగా, మెట్రో నిర్మాణ వ్యయం రూ.5,688 కోట్ల అంచనాతో గ్లోబల్‌ టెండర్లను సంస్థ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జులై 5 తుది గడువు. ఇప్పటివరకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు. సెలవు రోజులు మినహాయిస్తే మరో 5 రోజుల మాత్రమే గడువు ఉంది. విమానాశ్రయ మెట్రో 31 కి.మీ.కాగా, 29.3 కి.మీ. ఎలివేటెడ్‌తోపాటు 1.7 కి.మీ. భూగర్భంలో చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు