logo

రైలెక్కాలంటేనే భయమేస్తోంది

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రయాణికులను కలచి వేశాయి

Updated : 08 Jul 2023 04:23 IST

ప్రయాణికులను కలచివేసిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం

ప్రయాణికులకు బిస్కెట్లు అందిస్తున్న రైల్వే అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌- రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రయాణికులను కలచి వేశాయి. ïాల్ప్‌ డెస్కు వద్దకు వచ్చి ప్రయాణికులు, వారి సంబంధీకులు విచారించడం, కొన్ని రైళ్ల దారి మళ్లింపు, రద్దుతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో గందరగోళం ఏర్పడింది.

స్టేషన్‌కు చేరినా వీడని భయం : ప్రమాదంలో కాలిపోయిన బోగీలను అక్కడే వదిలేసి.. మిగతా 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే బస్సుల్లోనూ, ఇతర మార్గాల్లో వచ్చిన ప్రయాణికులు సైతం స్టేషన్‌కు చేరుకుని వారి సామాన్లు, వస్తువుల గురించి ఫిర్యాదు చేశారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి.. రైలు నుంచి దిగిన ప్రయాణికులు ఆందోళనగా కనిపించారు.  పొగ, మంటల కారణంగా సామాన్లు తీసుకోలేకపోయామని పలువురు వాపోయారు. స్టేషన్‌కు ఆకలితో చేరుకున్న ప్రయాణికులకు తాగునీరు, అల్పాహారం, బిస్కట్లు రైల్వే డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ విశాల్‌ అర్జున్‌, స్టేషన్‌ మేనేజర్‌ రాజనర్సు ఆధ్వర్యంలో అందజేశారు.


గంటదాకా ఎవరూ రాలేదు

ఏం జరిగిందో చూసే సరికి రైలులో మంటలు వ్యాపించాయి. భయపడిపోయాం. ఏసీ బోగిలో ఉన్నా, పక్కన రెండు బోగిల తరువాత చూస్తే మంటలు పొగలు వ్యాపించడంతో దిగిపోయాం. రైల్వే అధికారులు ఎవరూ గంట దాటినా రాలేదు. తినేందుకు తిండిలేదు.

 యుగంధర్‌


భయంతో వణికిపోయాం

ప్రమాదం జరిగిందని తోటి ప్రయాణికులు చెప్పారు. ఇటీవల ఒడిశాలో జరిగిన ప్రమాదం   కళ్ల ముందు కదిలింది. పిల్లలతో భయంతో కిందకి దిగిపోయాం. నేరుగా బస్సు ద్వారా వద్దామనుకునేలోగా ప్రత్యేక రైలులో సికింద్రాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. రైలులో స్టేషన్‌కు చేరుకున్నాం. ఇప్పటికీ భయంగా ఉంది.  

రషీద్‌


స్థానికులూ సాయం చేయలేదు

ఉదయం 10.30 గంటలకు ఈ రైలు చేరాలి. నేను బెర్త్‌ మీదే మెలుకువతో ఉన్నాను. రైలు వేగం తగ్గిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా బోగిలకు నిప్పంటుకుంది. భయంతో కిందకు దిగిపోయాం. సికింద్రాబాద్‌కు వద్దామనుకుంటే రైలు మార్గం లేదు. బస్సు ఎక్కాలంటే దూరం వెళ్లాల్సిన పరిస్థితి. రెండుగంటలపాటు అక్కడే ఉన్నాం. కనీసం తాగునీరు దొరకలేదు. చిన్న పిల్లలు చాలా ఇబ్బందిపడ్డారు. చుట్టు పక్కన వారు చూసేందుకు వచ్చారే కానీ ఎలాంటి సాయం అందించలేదు.  

రామారావు


ఆకలితో అలమటించాం

ఎస్‌-3 బోగీలో ప్రయాణం చేస్తున్నా. మంటలంటుకుని  పొగలు కమ్ముకున్నాయి. దిగుదామంటే దారి లేదు. రిజర్వేషన్‌ బోగీలనుకోవడమే కాని.. సాధారణ ప్రయాణికులతో బోగీ కిక్కిరిసి ఉంది. ప్రాణాలు పోతాయనుకునే హడావిడిగా దిగేశాం. బాత్‌రూం వద్ద పదుల సంఖ్యలో టికెట్లు లేని వాళ్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బయటకి వెళ్దామంటే అడ్డుగా ఉన్నారు. ఆకలితో అలమటించాం.        

రమాదేవి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని