logo

ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా.. మెట్రో పట్టాలెక్కేదెలా?

సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధంగా ఉంది.. సేకరించాల్సిన ఆస్తుల మార్కింగ్‌ చేశారు.. బడ్జెట్‌ కేటాయించారు.. ఇదివరకు వ్యతిరేకించిన పక్షాలే ఇప్పుడు కావాలంటున్నాయి..

Published : 10 Jul 2023 03:11 IST

ఎల్‌ అండ్‌ టీ కుదరదంటే మేమే కడతామన్న కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధంగా ఉంది.. సేకరించాల్సిన ఆస్తుల మార్కింగ్‌ చేశారు.. బడ్జెట్‌ కేటాయించారు.. ఇదివరకు వ్యతిరేకించిన పక్షాలే ఇప్పుడు కావాలంటున్నాయి.. అయినా అడుగు ముందుకు పడటం లేదు. పాతబస్తీ మెట్రో చిక్కుముడి వీడటం లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ మాటలనుబట్టి చూస్తే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా కన్పించడం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా పాతబస్తీ మెట్రో ఎన్నికల అజెండా అవుతోంది. అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలు అడగడం.. అధికార పక్షం సమాధానం చెప్పడంతోనే రెండు పర్యాయాలు గడిచిపోయాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనైనా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మెట్రో 5.5 కి.మీ. మార్గం పనులు  మొదలెడతారేమోనని స్థానికులు  ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ వ్యాప్తంగా 250 కి.మీ. వరకు మెట్రోరైలు నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని ప్రభుత్వం చెబుతోంది తప్ప ఈ పాతబస్తీ మెట్రో గురించి మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది.

అలైన్‌మెంట్‌ వివాదాలతో

జేబీఎస్‌-ఫలక్‌నుమా వరకు 16 కి.మీ. మార్గాన్ని మెట్రో కారిడార్‌-2గా దశాబ్దం క్రితం ప్రతిపాదించారు. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా వరకు ప్రార్థన మందిరాల స్థలాలను సేకరించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్‌ పార్టీ వ్యతిరేకించింది. అలైన్‌మెంట్‌ మార్చాలని కోరగా ప్రత్యామ్నాయంపై సర్కారు అధ్యయనం చేయించింది. మార్పు ఆర్థికంగా అంత లాభసాటి కాదని కమిటీ తేల్చింది. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాతబస్తీ మెట్రో అకెక్కింది.

సమగ్ర సర్వే పూర్తిచేశాం: కేటీఆర్‌

పాతబస్తీలో ప్రార్థన స్థలాలు పోతాయని కొందరు అభ్యంతరం పెట్టారు. సమగ్ర సర్వే చేశాం. కొవిడ్‌, నిర్మాణంలో జాప్యంతో వ్యయం పెరిగిందని పీపీపీలో చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ చేతులెత్తేసింది. 72 కి.మీ.గాను 69.2 కి.మీ. కట్టాం. ‘మా వల్ల కాదు.. కొవిడ్‌తో తీవ్రంగా నష్టపోయాం.. ప్రాజెక్ట్‌ వ్యయం ఎక్కువైంద’ని ఎల్‌ అండ్‌ టీ  చెబుతోంది. వాళ్లు చేయకపోతే ప్రభుత్వమే చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని