logo

DigiLocker: డిజి లాకర్‌లో పత్రాలుంటే.. ఒరిజినల్స్‌ అవసరం లేదు

డిజి లాకర్‌లో ధ్రువపత్రాలున్నాయా...? అయితే పాస్‌పోర్టు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ సులభమైనట్టే.. అపాయింట్‌మెంట్‌ ఉన్న రోజున వెళ్లి ఓ ఫొటో దిగొస్తే చాలు

Updated : 29 Jul 2023 10:16 IST

ఆధార్‌ డాక్యుమెంట్‌కు ఓకే చెప్పిన విదేశాంగ శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: డిజి లాకర్‌లో ధ్రువపత్రాలున్నాయా...? అయితే పాస్‌పోర్టు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ సులభమైనట్టే.. అపాయింట్‌మెంట్‌ ఉన్న రోజున వెళ్లి ఓ ఫొటో దిగొస్తే చాలు. తదుపరి ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజుల్లో పాస్‌పోర్టు మీ చేతికొస్తుంది. భౌతికంగా ధ్రువపత్రాలు అందించడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్‌ పెడుతూ విదేశాంగశాఖ డిజి లాకర్‌ ద్వారా పత్రాల అప్‌లోడింగ్‌కు అనుమతించింది. దీంతోపాటు ఈ-ఆధార్‌కూ అనుమతి లభించిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం తెలిపారు.
* రాష్ట్రవ్యాప్తంగా రోజూ 3,800కుపైగా అపాయింట్‌మెంట్లు మంజూరవుతున్నాయి. వీటిలో 10శాతం దరఖాస్తుల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు చూపించలేదని, ధ్రువపత్రాల్లో పొరపాట్లున్నాయని తిరస్కరించడం, ఆధార్‌కార్డు తీసుకురాలేదని తిప్పి పంపుతున్న సందర్భాలున్నాయి. ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తీసుకురాలేని వారికి మళ్లీ అపాయింట్‌మెంట్‌ దొరికి ప్రక్రియ పూర్తయ్యే సరికి మరో రెండు నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని తొలగించేందుకు విదేశాంగశాఖ డిజిలాకర్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసే ధ్రువపత్రాలను అనుమతిస్తోంది.

ఏంటీ ఈ డిజి లాకర్‌...

డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రవేశపెట్టిన డిజిలాకర్‌ ఆన్‌లైన్‌లో వినియోగదారులు తమ పత్రాలను భద్రపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. 12 సంఖ్యల ఆధార్‌ నంబర్‌ ద్వారా ఖాతా తెరవవచ్చు. డిజిలాకర్‌ ఉంటే డాక్యుమెంట్లు కాగిత రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పాస్‌పోర్టు దరఖాస్తుకు డిజిలాకర్‌ నుంచి ఆధార్‌ను అప్‌లోడ్‌ చేసే విధానం కోసం ఈ వీడియో చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు