logo

పండు కొనలేం.. కూర వండలేం

ఎడతెరిపిలేకుండా వర్షాలు.. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ పంటలు ప్రారంభ దశలో కురిసిన భారీ వర్షాలు ఇటు కూరగాయల  పంటను, పండ్ల తోటలను దెబ్బతీశాయి.

Published : 30 Jul 2023 05:28 IST

వర్షాలు.. వరదలతో దెబ్బతిన్న పంటలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎడతెరిపిలేకుండా వర్షాలు.. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ పంటలు ప్రారంభ దశలో కురిసిన భారీ వర్షాలు ఇటు కూరగాయల పంటను, పండ్ల తోటలను దెబ్బతీశాయి. ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా వరదలు ముంచెత్తడంతో పంటలు కొట్టుకుపోయాయి. ఉత్తరాదిన ఆపిల్‌ పంటలు దెబ్బతినడంతో నగరానికి వచ్చే పండ్లు భారీగా తగ్గిపోయాయి. దాదాపు 50 శాతం పంట వర్షాలపాలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కిలో ఆపిల్‌ రూ. 250కి పైగా మార్కెట్‌లో ధర పలుకుతుంది. ఇదే బాటలో దానిమ్మ ధరలు ఉన్నాయి. వందకు నాలుగు నుంచి 5 వరకూ వచ్చే దానిమ్మలు ఇప్పుడు రూ.250 పెడితే కాని నాలుగు రావడంలేదు. అన్ని పండ్లు అందుబాటు ధరల్లోకి రావాలంటే మరో 15 రోజులు సమయం పడుతుందని బాటసింగారం హోల్‌సేల్‌ మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి సీహెచ్‌. నరసింహారెడ్డి చెప్పారు.
మరో 20 రోజుల వరకూ.. వర్షాలు కురవకముందే కొండెక్కిన కూరగాయల ధరలు.. ఇప్పుడు వరదలతో బెంబేలెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ. 100కి తగ్గడంలేదు. వాస్తవానికి వారం పది రోజుల్లో రూ. 50 నుంచి రూ. 60కి అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. ఇప్పుడు వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో మరో 20 రోజుల వరకూ ఇలాగే ధరలుంటాయని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల నుంచి టమాటా పంట అందుబాటులోకి వస్తుందనుకుంటే.. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.  శ్రావణమాసం ప్రారంభమయ్యే నాటికి కాస్త ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నా.. అప్పుడు వినియోగం ఎక్కువగా ఉంటుందని దీంతో ధరలు స్థిరంగా ఉంటాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్లం, వెల్లుల్లి కిలో రూ. 250కి తగ్గడంలేదు. రైతుబజారులో మాత్రం రూ. 200 చొప్పున దొరుకుతోంది.


ఖరీఫ్‌తోనే ధరలు తగ్గుదల..

నగరానికి రంగారెడ్డి, మేడ్చల్‌, నల్గొండ, యాదాద్రి, వికారాబాద్‌ ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తాయి. ఖరీఫ్‌ కాలం మరో నెలరోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతున్న వేళ.. భారీగా వర్షాలు పడడంతో మొక్క దశలోనే పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. స్థానిక పంటలు అందుబాటులోకి వస్తేనే కూరగాయల ధరలు తగ్గుతాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మిగతారాష్ట్రాల్లో కూడా ఉంది. ప్రస్తుతం 80 శాతం కూరగాయలు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న తరుణంలో రవాణా ఖర్చులు భారీగా ఉండడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిమ్మ ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందని.. ఇప్పుడు గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి రావడంతో వాటి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని