logo

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయ భవనం.. ప్రారంభించిన మంత్రులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవనం ప్రారంభమైంది.

Updated : 17 Aug 2023 18:04 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవనం ప్రారంభమైంది. రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, ఆర్డీవో అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో రూ.2.25కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. 

అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడారు. రూ.4.5 కోట్లతో తహసీల్దార్‌, ఆర్డీవో నూతన కార్యాలయ భవనాలు నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌, రామోజీ గ్రూపు ఛైర్మన్‌ రామోజీరావుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల పక్షాన నిలవడంలో ఈనాడు, ఈటీవీ ఎప్పుడూ ముందుంటాయన్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవడంలో రామోజీ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని చెప్పారు. 

అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా దూసుకెళ్తోంది..

‘‘తెలంగాణ ఏర్పడ్డాక రంగారెడ్డి జిల్లా అభివృద్దిలో దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ను చూస్తే న్యూయార్క్‌లా ఉందని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఎన్నో వస్తున్నాయి. నీతి ఆయోగ్‌ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. కేసీఆర్‌ మరోసారి సీఎం కావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా చేస్తాం. కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన కర్ణాటకలో కరెంటు కోతలు ఉన్నాయి. మీటర్లు కావాలా? 3 గంటలు కరెంటు కావాలా?3 పంటలు కావాలా?ప్రజల ఆలోచించాలి. దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. చీకటి కాంగ్రెస్‌.. భాజపా కావాలా?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని