Hyderabad: మియాపూర్ ఘటన.. ఉద్యోగం పోగొట్టాడనే కక్షతోనే కాల్పులు!

మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు.

Updated : 24 Aug 2023 13:00 IST

హైదరాబాద్‌: మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని కేరళకు చెందిన రితీష్‌ నాయర్‌గా గుర్తించి అదుపులోకికి తీసుకున్నారు. మదీనాగూడలోని సందర్శిని హోటల్‌ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ (35)పై బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. 

రితీష్ నాయర్‌, దేవేందర్‌ గతంలో ఒకేచోట మేనేజర్లుగా పనిచేశారు. నెలరోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దేవేందర్‌పై రితీష్‌ చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి దేవేందర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో రితీష్‌ను యాజమాన్యం తొలగించింది. దేవేందర్‌ వల్లే ఉద్యోగం పోయిందంటూ అతడిపై రితీష్‌ కక్ష పెంచుకున్నాడు. దేవేందర్‌ బుధవారం రాత్రి విధులు ముగించుకుని వెళ్లే సమయంలో రెక్కీ నిర్వహించాడు. అనంతరం హెల్మెట్‌ ధరించి తన వెంట తెచ్చుకున్న దేశవాలీ తుపాకీతో అతడిపై ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై మాదాపూర్‌ డీసీపీ సందీప్‌ మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని