logo

టెట్‌ దరఖాస్తు ఫీజు తగ్గించండి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు రుసుం తగ్గించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సమితి ప్రతినిధులు మంగళవారం టెట్‌, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డికి వినతిపత్రం అందజేసింది.

Published : 27 Mar 2024 01:11 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు రుసుం తగ్గించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సమితి ప్రతినిధులు మంగళవారం టెట్‌, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డికి వినతిపత్రం అందజేసింది. అనంతరం ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర మాట్లాడుతూ... టెట్‌ దరఖాస్తు ఫీజు పెంపుతో పేద, మధ్యతరగతి అభ్యర్థులపై అధిక భారం పడుతుందన్నారు. గతంలో టెట్‌ ఒక పేపరు దరఖాస్తు రుసుం రూ.200, రెండు పేపర్లకు రూ.300 ఉండేదని,  ప్రస్తుతం ఒక పేపర్‌కు రూ.1000, రెండింటికి రూ.2వేలు చేయడం సరికాదన్నారు. కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే పరీక్ష ఉంటుందని అధికారులు ప్రకటించారని, దీనివల్ల మిగతా జిల్లాల అభ్యర్థులకు దూరభారంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు లేకుండా పోటీపరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పిందని, ఇప్పుడు పెద్దమొత్తంలో ఫీజులు నిర్ణయించడం వల్ల నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నెర్లకంటి శ్రీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్‌ పాల్గొన్నారు.


ఫీజును తగ్గించకుంటే ఆందోళన

గోల్నాక, న్యూస్‌టుడే: పెంచిన తెలంగాణ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌-2024) దరఖాస్తు ఫీజును తగ్గించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజును పెంచడమంటే పేద నిరుద్యోగ అభ్యర్థులపై ఆర్థిక భారం మోపడమేనని పేర్కొన్నారు. పెంచిన ఫీజును తగ్గించకుంటే ఎంపీ ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని