logo

వృథాచేస్తే.. కొరడా ఝళిపించాల్సిందే

విలువైన తాగునీటి వృథాపై బెంగళూరు తరహాలో నగరంలో కూడా కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 27 Mar 2024 01:50 IST

విలువైన నీటిని.. గార్డెనింగ్‌, వాహనాలు కడగడానికి వినియోగం
బెంగళూరు తరహాలో నగరంలోనూ అప్రమత్తత అవసరం
ఈనాడు, హైదరాబాద్‌

విలువైన తాగునీటి వృథాపై బెంగళూరు తరహాలో నగరంలో కూడా కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా బెంగళూరులో తాగునీటితో ల్యాన్లు తడపడం, బైక్‌లు, కార్లు కడుగుతున్న 22 కుటుంబాలను గుర్తించిన అక్కడి జలబోర్డు రూ.5 వేల వంతున జరిమానా విధించింది. జలమండలి పరిధిలో తాగునీటి వృథాపై చట్టం ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదు. హైదరాబాద్‌లో నీటి వృథాపై ఇప్పటి నుంచే అప్రమత్తత అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల నీటి వృథాపై వేసిన ప్రజావాజ్యంపై హైకోర్టు స్పందించి జలమండలిని వివరణ అడిగింది. ఈ నేపథ్యంలో తాగునీటిని ఇతర అవసరాలకు వాడకూడదని జలమండలి పౌరులను హెచ్చరించింది. అలా చేస్తే వాటర్‌ సప్లై రూల్స్‌ 1990, సెక్షన్‌ 18 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నల్లా కనెక్షన్‌ తొలగింపుతోపాటు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తాగునీటిని తరలిస్తున్నారు. ఇందుకు జలమండలి ప్రతి వెయ్యి లీటర్లకు రూ.50-60 ఖర్చు చేస్తోంది. అంత విలువైన నీటిలో 20-25 శాతం వృథా అవుతోంది. అందుకే తాగునీటి అవసరాలకు తప్పా...నిర్మాణాలు, ల్యాన్లు తడపటం, వ్యాపారానికి వాడకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇలాంటి అవసరాలకు సమీపంలోని నీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)ల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని తెలిపింది. అతి తక్కువ ధరకే ఈ నీటిని అందిస్తున్నట్లు పేర్కొంది.


ఇలా ఆదా చేయండి..

  • స్నానం చేసేటప్పుడు షవర్‌ వాడటం వల్ల ఎక్కువగా నీటి వృథా అవుతుంది. నిమిషానికి 13 లీటర్లు.. 5 నిమిషాలకు 65 లీటర్లు షవర్‌ స్నానానికి అవసరం. అదే బకెట్‌తో నీళ్లు పట్టుకొని స్నానం చేయడం వల్ల 20-25 లీటర్లతో ముగించవచ్చు. ఇలా ఒక్కో స్నానానికి 40 లీటర్లు ఆదా అవుతాయి.
  • ఇంట్లో కుళాయిలకు ఏరేటర్స్‌ ఏర్పాటు చేయడం వల్ల ఒక రోజు మొత్తంలో గిన్నెలు శుభ్రం చేయడానికి 90-100 లీటర్లు సరిపోతాయి. అదే ధారగా పడే కుళాయి వాడటం వల్ల 450 లీటర్లు వరకు అవసరం అవుతుంది. ఇక్కడే రోజుకు 350 లీటర్లు ఆదా చేయవచ్చు.
  • వాటర్‌ ఫ్యూరిఫయర్‌ నుంచి వచ్చే నీటిని గార్డెనింగ్‌, ఇల్లు తుడవటానికి  ఉపయోగిస్తే రోజులో 30 లీటర్లు పొదుపు చేయవచ్చు. కారు, బైక్‌ వాష్‌ చేయకుండా దుమ్ము దులిపి...తడిగుడ్డ వాడి శుభ్రం చేయడం వల్ల 30-50 లీటర్లు వరకు నీటిని మిగల్చవచ్చు.
  • పబ్లిక్‌ నల్లాలకు ట్యాప్‌లు లేకపోవడం వల్ల నీళ్లు పట్టుకున్న తర్వాత వృథాగా పోతున్నాయి. అధికారులు ట్యాప్‌లు బిగించి నీళ్లు పట్టుకున్న తర్వాత బంద్‌ చేస్తే రోజుకు   3-4 వేల లీటర్లు ఆదా చేసే అవకాశం    ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని