logo

సెల్‌ఫోన్‌ చోరీల ముఠా అరెస్టు

ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్‌ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Mar 2024 02:54 IST

నిందితుల్లో ఐదుగురు మైనర్లు

రెజిమెంటల్‌బజార్‌: ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్‌ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 సెల్‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. ఉత్తర మండలం అదనపు డీసీపీ పి.అశోక్‌, గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీఐ కౌషీక్‌లు వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట హనుమాన్‌నగర్‌కు చెందిన కొంగిటి జాన్సన్‌ (20) సెంట్రింగ్‌ పని, మహ్మద్‌ సొసైల్‌ (20) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. జాన్సన్‌పై జగద్గిరిగుట్ట ఠాణాలో కేసులున్నాయి. 2012లో పోక్సో కేసులో అరెస్టయ్యాడు. ఇతను సొసైల్‌పాటు మరో ఐదుగురు మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. రాత్రి వేళ ఆటోలో తిరుగుతూ స్నాచింగ్‌లు, దొంగతనాలు ప్రారంభించారు. ఈ నెల 23న ఎస్‌డీ రోడ్డులోని పిస్తా హోటల్‌లో పని చేసే జార్కండ్‌ వాసి రోషన్‌కుమార్‌ గుప్తా అర్ధరాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. క్లాక్‌టవర్‌ సమీపంలోని బాప్టిస్ట్‌ చర్చి సమీపంలో ఆటోలో వచ్చిన నిందితులు అతడి సెల్‌ఫోన్‌ను లాక్కొని ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 25న రాత్రి 11.30గంటల సమయంలో చిలకలగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. అనుమానాస్పదంగా ఆటోలో తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. క్లాక్‌టవర్‌, బోయిన్‌పల్లి, బాలానగర్‌, ఫతేనగర్‌ బ్రిడ్జి వద్ద సెల్‌ఫోన్లు అపహరించుకుని ఉడాయించినట్లు తేలింది. ఐదుగురు మైనర్లతో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని