logo

హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం

జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

Published : 28 Mar 2024 03:10 IST

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందుకు వివిధ రకాల మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రస్తుతం పదో విడతలో నిర్దేశించుకున్న లక్ష్యాలతో పంచాయతీ స్థాయిలో నర్సరీలను ఏర్పాటు చేస్తూ మొక్కలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకుగాను నర్సరీల నిర్వహణపై మొదట్లోనే శిక్షణ ఇచ్చారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

వర్షాలు ఆరంభంకాగానే శ్రీకారం

ఈ ఏడాదిలో వర్షాలు కురిసిన వెంటనే హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన నాటే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో (చౌడాపూర్‌, దుద్యాల నమోదులేదు) 566 గ్రామ పంచాయతీల్లో 2023-24 ఏడాదిలో 33.99 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్ధరించారు. పంచాయతీకి ఒక్కటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేస్తూ ఆయా గ్రామాల్లోని ప్రజల ఆసక్తిని గుర్తించి మొక్కల రకాలను ఎంపిక చేశారు. కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవటంతో ప్రతి ఏడాదిలో మొక్కలు మిగిలిపోతున్నాయని అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీల్లో కొత్తగా ఐదు వేలతో పాటు ఆయా గ్రామాల్లో గతేడాదిలో మిగిలిన మొక్కలను కలిపి లక్ష్యంగా నిర్ణయించారు.

  • నవంబరులో ఎర్రమట్టి, పశువుల ఎరువులతో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం పచ్చందాలతో నర్సరీలు ఆకట్టుకుంటున్నాయి. హరితహారం అమలు తీరుపై జిల్లాస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న అధికారులు గ్రామాల్లోని నర్సరీలను పరిశీలిస్తున్నారు.

ఎరువుల తయారీతో కూలీలకు ఉపాధి

గ్రామాల్లో హరితహారం నర్సరీల నిర్వహణతో కూలీలకు నిత్యం ఉపాధి లభిస్తోంది. ఎర్రమట్టి, పశువుల పేడ, రసాయన ఎరువును మిశ్రమంగా తయారు చేసే సమయం నుంచి కూలీలు, వనసేవకులదే ప్రధాన పాత్రగా ఉంటోంది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మట్టి తీసుకొచ్చిన తర్వాత కూలీలతో సేంద్రియ, రసాయన ఎరువులతో మిశ్రమాన్ని తయారు చేయించటం, సంచుల్లో మట్టిని నింపటం, వరుసల్లో పేర్చటం, విత్తనాలు వేయటం, అంటు కొమ్మల సేకరణ, నీరు పట్టడం వంటి అంశాలపై ముందుగానే శిక్షణ ఇచ్చారు. ఒక్కో నర్సరీలో ఇద్దరు, ముగ్గురు చొప్పున పని చేస్తుండగా జిల్లాలో కూలీలు ప్రతి రోజు ఉపాధి పొందుతున్నారు.


పంచాయతీలదే నిర్వహణ బాధ్యత

గ్రామాల్లో హరితహారం నర్సరీల బాధ్యతను పంచాయతీలే చూస్తున్నాయి. ఎండలు ముదరడంతో మొక్కలపై కొన్నిచోట్ల చలువ పందిళ్లు వేస్తున్నారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు సన్నద్ధంగా  ఉంటున్నాం. అందుకు నర్సరీల్లో మొక్కల పెరుగుదలపై దృష్టి సారించాం. ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల ఆవరణ, రోడ్డు పక్కల నాటే మొక్కలతో పాటు ఇంటింటికీ సరఫరా చేసేందుకు అనుకూలమైన పండ్లు, పూల మొక్కలను కూడా పెంచుతున్నాం.

మల్లికార్జున్‌, ఏపీఓ, బొంరాస్‌పేట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని