logo

ఏడు పదుల వయసులో ఎంత కష్టం!

ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు.

Updated : 28 Mar 2024 06:58 IST

అనారోగ్యం, కుటుంబ గొడవలతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం
రైలుకింద పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు

గాయాలతో ఉన్న వృద్ధుడిని తరలించడంపై తర్జనభర్జనలో పోలీసులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఖైరతాబాద్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన రాములు(70) ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె సొంతూరిలో ఉంటున్నారు. కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తండ్రి రాములుతో గొడవ పడుతుండేవాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలు వేధించేవి. మంగళవారం కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఇంట్లోనే పురుగుమందు తాగాడు. ఇరుగుపొరుగు గుర్తించి ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆసుపత్రి నుంచి బయటకొచ్చాక సాయంత్రం ఖైరతాబాద్‌ రైల్వే గేటు వద్దకు వచ్చాడు. ట్రాక్‌ మీదకు వెళుతుండగా గేట్‌మెన్‌ అడ్డుచెప్పడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపటికి ఎవరూ చూడకుండా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. ఖైరతాబాద్‌ స్టేషన్‌ వైపు నుంచి నాంపల్లి వెళ్లేందుకు రైలు ఇంజిన్‌ లోక్‌పైలెట్‌ పట్టాలపై వ్యక్తిని గమనించి వేగం తగ్గించాడు. పట్టాల మధ్య పడుకున్న రాములు తలపైకెత్తి చూసేలోపే దగ్గరకు వచ్చి ఇంజిన్‌ తలను బలంగా ఢీకొట్టడంతో పట్టాల మధ్య పడిపోయాడు. లోకోపైలెట్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నాడు.

అరగంటకు పైగా పట్టాలపైనే.. తొలుత వచ్చిన రైల్వే పోలీసులిద్దరూ కొత్తగా విధుల్లో చేరినవారు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం నిరీక్షించారు.  ఖైరతాబాద్‌ పోలీసులూ వచ్చినా రైల్వే సిబ్బందిదే పరిధి అని చెప్పి వెనుదిరిగారు. 108 సిబ్బంది వచ్చి వివరాలకోసం వేచిఉన్నారు. అప్పటికే తీవ్రగాయాలైన రాములు దాహం వేస్తోంది నీళ్లివ్వాలంటూ వేడుకోవడం కన్నీరు పెట్టించింది. దాదాపు అరగంటపాటు రక్తమోడుతూ పట్టాలపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంతలో ఎంఎంటీఎస్‌ రైలు వస్తోందని గేట్‌మెన్‌ అప్రమత్తంచేయగా అంబులెన్స్‌లో ఎక్కించారు. మరో పావుగంటకు ఉన్నతాధికారుల ఆదేశంతో ఓ కానిస్టేబుల్‌ వెంట వెళ్లారు. ప్రస్తుతం రాములు ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని రైల్వే పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని