logo

సన్నని ధార...చాలని సరఫరా

ఒకవైపు గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. జలమండలి అరకొర నీటి సరఫరా...అందులో తక్కువ ఒత్తిడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 29 Mar 2024 03:45 IST

గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు
నల్లా సమయంలోనూ అరగంటపైనే కోత

బాలాజీనగర్‌ డివిజన్‌ వివేక్‌నగర్‌లో కొన్నిరోజులుగా నీరు రాకపోవడంతో గుంతలు తీసి వదిలేసిన సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మౌలాలి, మూసాపేట్‌, వెంగల్‌రావునగర్‌: ఒకవైపు గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. జలమండలి అరకొర నీటి సరఫరా...అందులో తక్కువ ఒత్తిడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నీళ్లు సరిపోక తిరిగి నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ప్రధాన నగరం, శివారు మున్సిపల్‌ సర్కిళ్లలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ప్రాంతాలకు 3, 5 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 650 మిలియన్‌ గ్యాలన్ల పైనే అవసరం ఉండగా.. జలమండలి 559 ఎంజీడీల వరకు అందిస్తోంది. మిగతా జలాల కోసం బోర్లపై ఆధారపడేవారు. అయితే బోర్లు అడుగంటడంతో ఆ ప్రభావం జలమండలి నీటి సరఫరాపై పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో సరఫరాలో కోత పెట్టడంతోపాటు లోప్రెషర్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.  

  • కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలో గతంలో కంటే అరగంట కోతపెట్టి.. ప్రస్తుతం 45 నిమిషాలు  నీటి సరఫరా జరుగుతోంది. బాలాజీనగర్‌ డివిజన్‌ వివేక్‌నగర్‌లో కొన్నిచోట్ల లోప్రెషర్‌ సమస్య ఉంది. దీంతో నల్లాలకు మోటార్లు బిగిస్తున్నారు.  ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఫిరోజ్‌గూడ, ఫతేనగర్‌, బాలాజీనగర్‌ డివిజన్లలో లోప్రెషర్‌ సమస్య తీవ్రంగా ఉంది.
  • హైదర్‌నగర్‌ డివిజన్‌ అడ్డగుట్టలోని కొన్ని ప్రైవేటు వసతి గృహాలకు సమయంతో సంబంధం లేకుండా తాగునీరు సరఫరా చేస్తుండగా.. భాగ్యనగర్‌కాలనీ, మిత్రాహిల్స్‌, హైదర్‌నగర్‌లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
  • ఒకవైపు నీటి కొరత.. మరోవైపు తాగునీరు వృథా అవుతోంది. మౌలాలి కమాన్‌ నుంచి చందాబాగ్‌ దారిలో ప్రభుత్వ పాఠశాల దాటాక సీసీ రోడ్డుపై లీకేజీ, దానికి పక్కనే మ్యాన్‌హోల్‌లో వాల్వూ నుంచి తాగునీరు లీకై మురుగు కాలువలో కలుస్తోంది.
  • వెంగళరావునగర్‌, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలోని డి-బ్లాకు, కమాన్‌గల్లీ, జవహర్‌నగర్‌, మసీద్‌గడ్డ, వీడియోగల్లీ ప్రాంతాల్లో  మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని, అవి కూడా కేవలం 45 నిమషాలు మాత్రమే విడుస్తున్నారని వాపోతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని