logo

మెట్రో రాయితీలు మళ్లీ ఇచ్చేనా!

మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు గత నెలాఖరుతో ముగిశాయి.

Updated : 08 Apr 2024 07:24 IST

మార్చితో ముగిసిన హాలిడే కార్డు, స్టూడెంట్‌ పాస్‌లు  

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు గత నెలాఖరుతో ముగిశాయి. సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణ సదుపాయం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిశాయి. మెట్రో రైలు మూడు మార్గాల్లో ప్రతిరోజు సగటున 5 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదవుతున్నాయి. పనిదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటే.. వారాంతాల్లో తక్కువగా ఉంటోంది. వేసవి కావడంతో వాహనాలను స్టేషన్ల వద్ద నిలిపి మెట్రోలోనే ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు.

ఒక్కొక్కటిగా తొలగిస్తూ..

  • మెట్రో  ప్రారంభం నుంచి కార్డుపై ప్రయాణించే వారికి 10శాతం రాయితీ ఉండేది. గరిష్ఠ టికెట్‌ రూ.60 ఉంటే.. కార్డుతో ప్రయాణించే వారికి రూ.6 తగ్గేది. గత ఆర్థిక సంవత్సరంలో లాభనష్టాలను బేరీజు వేసుకున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ 10 శాతం రాయితీకి షరతులు విధించింది. ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో రాయితీ తొలగించి.. మధ్యాహ్నం  ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం తగ్గింపు ఇచ్చారు. ఇప్పుడు దీన్నీ ఎత్తేశారు.
  • మెట్రో పాసులు ప్రవేశపెట్టాలని ఎంతోకాలంగా డిమాండ్లు ఉన్నాయి. గత ఏడాది విద్యార్థుల కోసం స్టూడెంట్‌ పాస్‌లను ట్రిప్‌ల రూపంలో తీసుకొచ్చింది. 20 ట్రిప్పులు పాస్‌లు కొంటే 30 ట్రిప్పుల వరకు ప్రయాణించేలా పాస్‌ సదుపాయం కల్పించారు. దీని గడువూ ముగిసింది. ఇప్పటికే కొన్నవారు ఏప్రిల్‌ 30 వరకు వినియోగించుకోవచ్చు.

కార్డులు ఏం చేయాలి?

రూ.50 చెల్లించి కొనుగోలు చేసిన కార్డులను ఏం చేయాలని చాలామంది  అడుగుతున్నారు. వీటిని వేర్వేరు విధానాల్లో ఉపయోగించుకోవచ్చని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.  సూపర్‌ సేవర్‌ హాలిడే ఆఫర్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్‌ పాస్‌లనూ పునరుద్ధరించాలని ఒత్తిడి వస్తోంది. వేరే రూపంలో వీటిని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని