logo

ఈకేవైసీ.. గడువుతో పనిలేదు

నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు ఆధార్‌ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది.

Published : 20 Apr 2024 03:17 IST

మొత్తం రేషన్‌ కార్డుదారులు.. 2.41 లక్షలు
ఆధార్‌ నమోదు..82 శాతం  

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌: నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు ఆధార్‌ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. నిరంతర నమోదు అవకాశం కల్పించింది. నిజానికి ఫిబ్రవరి 29తో ఈ గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. లబ్ధిదారుల్లో ఇంకా ఇప్పటి వరకు నమోదు చేేసుకోని వారున్నారు. దీంతో అందరూ సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

అర్హులకే పథకాలు చేరాలనే ఉద్దేశం

జిల్లాలో మొత్తం 12 లక్షల జనాభా ఉంటే మొత్తం రేషన్‌ కార్డుదారులు దాదాపు 3 లక్షలున్నారు. వీరిలో అధిక శాతం రేషన్‌ సరకులు తెచ్చుకుంటున్నారు. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పకడ్బందీగా రేషన్‌ అమలుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. దీనికోసం అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. ఎలా చేయాలో స్పష్టంగా వివరించారు. చేసుకోకపోతే మాత్రం ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ వాస్తవం గ్రహించిన ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించింది.

ఇవీ ఎదురవుతున్న సమస్యలు  

ఈకేవైసీ చేసుకోవడానికి లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోవడం తప్పనిసరి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతోంది. పలువురి  వృద్ధుల వేలిముద్రలు పడడం లేదు. మీ సేవ, ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నవీనీకరణ పూర్తి చేసుకుంటున్నా ఈకేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. వలస వెళ్లిన వారి కోసం అక్కడ ఉండే రేషన్‌ దుకాణాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. తాజా అవకాశాన్ని అర్హులు ఉపయోగించుకోవాలి.


సద్వినియోగం చేసుకోవాలి: రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల విభాగం అధికారి

జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. లబ్ధిదారులు తమకు సమీపంలో ఉన్న రేషన్‌ దుకాణానికి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతానికి తుది గడువు అంటూ ఏమీ లేదు. సాంకేతిక సమస్యలు, వేలిముద్రలు పడని వారి జాబితాను డీలర్ల వద్ద తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. లబ్ధిదారులకు డీలర్లు ఇబ్బంది కల్గిస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని