logo

‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’

హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 03:41 IST

ప్రచార సభలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు

చార్మినార్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బహదూర్‌ఫుర నియోజకవర్గం తీగలకుంట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మజ్లిస్‌ తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు ఆ పార్టీ నేతలు నగరంలో సర్జికల్‌ స్ట్రైక్‌ నినాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రస్తుతం బుల్డోజరుతో ఇళ్లను నేలమట్టం చేస్తామనే బెదిరింపులు సైతం వినిపించడం శోచనీయమన్నారు. యూపీ రాజకీయ సంస్కృతిని హైదరాబాద్‌కు తీసుకురావాలని తెగింపు చేస్తున్నారని విమర్శించారు. నగరంలో మత కలహాలు ప్రేరేపించే రీతిలో ఇటీవల ఓ వీడియో విడుదలైందన్నారు. మసీదుపై బాణం ఎక్కుపెట్టిన మాదిరి ఆ వీడియో ఉందన్నారు. పరోక్షంగా భాజపా అభ్యర్థి మాధవీలత బాణం చేతపట్టిన తీరును ఆయన తప్పుపట్టారు.  భాజపా ప్రజల్లో మతవిద్వేషాలు సృష్టిస్తే.. తాము సామరస్య భావనతో నగరాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. తనను బెదిరించినా, తన కారుపై బుల్లెట్ల వర్షం కురిపించినా తాను భయపడేదిలేన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్‌ తారీఖ్‌ అన్వర్‌పై విష ప్రయోగం చేశారని, తనపై కూడా అలాంటి ప్రయోగం చేసినా భయపడేది లేదన్నారు.  20 ఏళ్లుగా పార్లమెంట్‌లో ప్రజా వ్యతిరేక చట్టాలపై పోరాటం సాగించానన్నారు. సీఏఏ చట్టాన్ని తాను వ్యతిరేకించానన్నారు.  సభలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, మిర్‌ జుల్ఫీకర్‌ అలీ, మహ్మద్‌ మొబిన్‌, మేరాజ్‌ హుస్సేన్‌, కౌసర్‌ మొహియుద్దీన్‌, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ అఫండీ, మాజీ ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని