logo

లక్ష్యం @ 60%

రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.

Updated : 20 Apr 2024 06:05 IST

పోలింగ్‌ శాతం పెంచేలా కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. గతమెన్నడూ లేని విధంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, ఏడాదిన్నర కాలంలో ఐదు లక్షలకుపైగా బోగస్‌ ఓట్ల రద్దుతో.. ఈసారి పోలింగ్‌ శాతం పెరగనుందని ఎన్నికల విభాగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆమేరకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ గడిచిన ఐదు ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతాన్ని వేర్వేరు స్థాయిల్లో పరిశీలిస్తున్నారు. ఎక్కువ మందితో ఓటు వేయించేందుకు అవసరమైన చర్యలను ముమ్మరం చేశారు.

గడిచిన ఐదు ఎన్నికల్లో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2009లో సాధారణ ఎన్నికలతో(అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు) ప్రారంభించి.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలు, 2018 నాటి అసెంబ్లీ, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికలో నమోదైన పోలింగ్‌ శాతాన్ని పోలింగ్‌ కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రోనాల్డ్‌రాస్‌ విశ్లేషించారు. వాటిలో 25శాతం కన్నా తక్కువ, 70శాతానికి మించి పోలింగ్‌ నమోదైన కేంద్రాలను ఆయన లెక్క తీశారు. ఆయా పరిస్థితులకు గల కారణాలను విశ్లేషించారు. వాటిని బేరీజు వేసుకుని.. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని 60కి పెంచేలా అధికారులకు కార్యాచరణ ఇచ్చారు. రోజూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఇంటికి బీఎల్‌ఓ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకోవడం, పోలింగ్‌ కేంద్రం, ఇతర సమాచారాన్ని అందించడం, దివ్యాంగులకు ఇంటి వద్దకు వాహనాలను పంపించి పోలింగ్‌ కేంద్రాలకు తరలించడం, కొత్త ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా ప్రముఖులతో ప్రకటనలు ఇవ్వడం, తదితర ఓటరు చైతన్య కార్యక్రమాలతో ఓటు శాతాన్ని పెంచాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని