logo

ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం

రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది.

Published : 20 Apr 2024 06:03 IST

నగరంలో భారాస నేతలకు కాంగ్రెస్‌ గాలం
హస్తం గూటికి చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే
మరికొంత మంది శాసనసభ్యులతో చర్చలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇదే దారిలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరడానికి సిద్ధంకాగా.. కొందరు సీనియర్‌ నేతలు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ప్రక్రియ ఆగిందని చెబుతున్నారు. కొంతమంది సీనియర్‌ నేతలు కూడా మూడు రంగుల జెండా మెడలో వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో భారాసను ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, చిత్రంలో టీఎంఆర్‌ఈఐఎస్‌ అధ్యక్షుడు ఫహీమ్‌ ఖురేషీ, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి.


కొందరిపై విముఖత.. మరికొందరికి భరోసా

ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఇందులో ఒకరి విషయంలో చేర్చుకోవడానికి అగ్రనేతలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి భారాసను వీడుతున్నారని రెండు నెలల కిందట పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని మల్లారెడ్డి ఖండించినా.. కాంగ్రెస్‌ అగ్రనేతలు అంగీకరిస్తే కొద్ది నెలలు తరువాత ఈ చేరికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. ఈ ఇద్దరే కాకుండా మరో నలుగురు కూడా సిద్ధమైనట్లు సమాచారం. వీరంతా ఎన్నికల ముందు చేరతారా.. తరువాత వెళ్తారా అన్నది వారం రోజుల్లో తేలుతుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకవేళ ఓడిపోతే మంత్రివర్గంలో చోటిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇతర ఎమ్మెల్యేలకు సైతం అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. భారాసలోని కీలక నేతలను గుర్తించి మాట్లాడబోతున్నామని కాంగ్రెస్‌ నేత ఒకరు పేర్కొన్నారు.


వారికి అధికారం.. వీరికి అవసరం

సాధారణంగా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకే అధికారం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండిపోతే ఎవరూ పట్టించుకోరని, అధికారులపై సైతం పెత్తనానికి వీలుండదు. మహానగరం పరిధిలో మొన్నటి ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీనియర్లే. ఒక్కొక్కరు రెండుసార్లు నుంచి ఆరేడుసార్లు గెలిచిన వారే. గత భారాస ప్రభుత్వంలో వీరంతా పూర్తి అధికారాన్ని చెలాయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గులాబీ ఎమ్మెల్యేలే ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. ఆ పార్టీ ప్రతిపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇప్పుడు వారిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇలా నాలుగున్నరేళ్లు డమ్మీలుగా మిగిలిపోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. కాంగ్రెస్‌ చేరుతున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నాలుగుసార్లు గెలిచారు. ఆయన కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.    కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పడానికి ప్రకాష్‌గౌడ్‌ సీఎంను కలిశారని తెలిసిన వెంటనే స్థానిక, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం ఫోన్‌ చేయడం ప్రారంభించారని ఆయన వర్గీయులు తెలిపారు. అధికారుల నుంచి ఇలాంటి స్పందనే కావాలన్న ఉద్దేశంతో మిగిలిన వారు సైతం పార్టీ మారాలని భావిస్తున్నారు.


కార్పొరేటర్లతో చర్చలు..

బల్దియాలో భారాసకు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీని దెబ్బతీయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే మేయర్‌ గద్వాల  విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డితోపాటు పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరో ఆరేడుగురితో చర్చలు జరిపినట్లు తెలిసింది. భారాసలో జనంతో సంబంధాలున్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్‌లో బలోపేతం కావాలని.. రాజధాని పరిధిలో కనీసం మూడుస్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని