logo

నినాదాల హోరు.. కాంగ్రెస్‌ శ్రేణుల జోరు

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అత్తాపూర్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్‌పల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Published : 26 Apr 2024 01:53 IST

అత్తాపూర్‌లో సందడిగా సీఎం రోడ్‌షో

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అత్తాపూర్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్‌పల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హైదర్‌గూడ 143 పిల్లర్‌ వరకు ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీ నినాదాలతో హోరెత్తించారు. హైదర్‌గూడ చౌరస్తాలో భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పలువురు సిక్కులు రేవంత్‌రెడ్డికి తలపాగా దరింపజేశారు.  

క్యాడర్‌లో జోష్‌: ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది. భారాస, భాజపాలపై ఆయన పదునైన విమర్శలు చేయడంతో కార్యకర్తలు జై కాంగ్రెస్‌, జై రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి స్థానిక కాంగ్రెస్‌ నేతలు పోటీపడ్డారు. అయితే తనదగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం ముందుకు సాగారు. రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతం కాడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఎంపీ రంజిత్‌రెడ్డి తన ప్రసంగంలో సామాజిక మాధ్యమాలలో ప్రతిపక్ష పార్టీనేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఉప్పర్‌పల్లికి చెందిన సామ ఇంద్రపాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. స్థానిక నాయకులు ఇంద్రపాల్‌ను సీఎం పరిచయం చేయగా ఇంద్రపాల్‌ తనకు ముందే తెలుసంటూ ముఖ్యమంత్రి ఆయన భుజం తట్టారు.


చేవెళ్లకు 88 నామినేషన్లు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి చివరి రోజు 35 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 88కి చేరుకున్నాయి.  కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చివరి రోజు మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.  కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరుతో ఉన్న వ్యక్తి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. బీఎస్పీ అభ్యర్థిగా గోపిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఇండియన్‌ ప్రజాకాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బానోతు వెంకన్న, ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌, భారాస అభ్యర్థిగా కాసాని వీరేష్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పాలమాకుల మధు, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా నరసింహారెడ్డి, అన్నా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థిగా ఇబ్రహీం ఉల్హక్‌, ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా రాఘవేందర్‌, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థిగా వసంత్‌ కుమార్‌, బ్లూ ఇండియా పార్టీ అభ్యర్థిగా వెంకటస్వామి, జనతాదళ్‌ పార్టీ అభ్యర్థిగా ప్రభాకర్‌, యుగతులసి అభ్యర్థిగా బింగి రాములు నామినేషన్లు వేశారు. భారాసకు చెందిన అనంత్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సూర్యప్రకాష్‌రెడ్డి, ఆంజనేయులు, మహమ్మద్‌ రియాజ్‌, ఎ.ప్రవీణ్‌, రాచమల్ల రాజేష్‌, మల్లేష్‌, సుకుమార్‌, హిమాం హుస్సేన్‌, జలీల్‌ అహ్మద్‌, శ్రావణి, గాదె రంజిత్‌రెడ్డి, ఎస్‌.కె.సమీర్‌, సయ్యద్‌ ఇబ్రహీం, కె.శివాని, శ్రీనివాసరావు జాదవ్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని