logo

జేఈఈ మెయిన్స్‌లో సత్తా

ఇంజినీర్‌ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్‌ సాధించి ప్రతిభ కనబరిచారు.

Updated : 26 Apr 2024 05:46 IST

 ఈనాడు, హైదరాబాద్‌, నారాయణగూడ, రాయదుర్గం, న్యూస్‌టుడే, మాదాపూర్‌

ఇంజినీర్‌ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్‌ సాధించి ప్రతిభ కనబరిచారు.

అంకుర సంస్థలు స్థాపిస్తా..

- మురికినాటి దివ్యతేజ రెడ్డి, 15వ ర్యాంక్‌

ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకున్న తర్వాత ఐఐటీ బాంబేలో చదవాలనుకున్నా. 8వ తరగతి నుంచే ఇంజినీరింగ్‌ చదువుపై ఆసక్తి కలిగింది. అప్పుడే ఇంజినీర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆకాశ్‌   ఇన్‌స్టిట్యూట్‌లో ఎంపీసీ చేరాక. మెయిన్స్‌పై దృష్టిపెట్టా. ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకుని వాటిని పదేపదే స్మరించుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. వందశాతం పర్సంటైల్‌ వస్తుందని అనుకున్నా.. వచ్చింది. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ గృహిణి. నాకు ర్యాంక్‌ వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా తనదే. చదువు పూర్తయ్యాక అంకుర సంస్థలను స్థాపించాలని అనుకుంటున్నా.


అడ్వాన్డ్స్‌పైనే దృష్టి సారించా..

- రిషి శేఖర్‌ శుక్లా, 19వ ర్యాంక్‌

ఇంటర్‌ తొలి సంవత్సరంలో ఓరియంటేషన్‌ తరగతులతో జేఈఈపై అవగాహన వచ్చింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే అడ్వాన్డ్స్‌కు అర్హత లభిస్తుందని అధ్యాపకులు చెప్పారు. జేఈఈ మెయిన్స్‌ కాదు అడ్వాన్డ్స్‌పై గురిపెట్టాలని బలంగా నిర్ణయించుకున్నా. అప్పటినుంచి ప్రశ్నపత్రాలు ఎలా వస్తాయి? వాటికి సమాధానాలు ఎలా రాయాలి? అన్న అంశాలను ప్రతిరోజూ అధ్యాపకులను అడిగేవాడిని. వందశాతం పర్సంటైల్‌ వస్తుందని తెలుసు, 19వ ర్యాంకు ఊహించలేదు. నాన్న మనీష్‌ శేఖర్‌ ఇస్రోలో శాస్త్రవేత్త. అమ్మ గృహిణి. ఆమె ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది.


ఐఏఎస్‌ సాధించాలన్నదే నా లక్ష్యం..

- తవ్వా దినేష్‌, 24 ర్యాంక్‌

మాది కడప పట్టణం. నాన్న చంద్ర ఓబుల్‌రెడ్డి జైళ్ల శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. కడపలోనే పదో తరగతి వరకు చదివా. ఇంటర్మీడియేట్‌ నారాయణ కళాశాలలో చేరాను. ప్రథమ సంవత్సరం నుంచే ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయడం, తరువాత పునశ్చరణ, వారాంతపు పరీక్షలతో అన్ని అంశాలపై అవగాహన పెంచుకున్నా. అధ్యాపకులు ఎంతో సహకారం అందించారు. ఐఐటీ ముంబయిలో చదువు పూర్తిచేశాక ఐఏఎస్‌ సాధించాలన్నదే నా లక్ష్యం.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని

- రితేష్‌ బాలాజీ, 39 ర్యాంక్‌

ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 39 ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా. నాన్న వెంకటేశ్వర్లు వ్యాపారి. అమ్మ సంధ్యారాణి గృహిణి.  మాదాపూర్‌ నారాయణ క్యాంపస్‌లో జేఈఈ శిక్షణకు తీసుకున్నా. తరుచూ పరీక్షలు నిర్వహించడమే కాకుండా సందేహాలను అధ్యాపకులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఎంతో సహకారం అందించారు. ఐఐటీలో ఎక్కడైనా సరే సీటు సాధించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలన్నది నా లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని