logo

యువత ఓటెత్తాలి

నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Updated : 03 May 2024 05:25 IST

స్వచ్ఛంద సంస్థల ప్రచారం
ప్రజాస్వామ్య పండుగ పేరుతో కార్యక్రమాలు
ఈనాడు, హైదరాబాద్‌

అక్షర రూపంలో నిల్చున్న బేగంపేటలోని ఓ పాఠశాల విద్యార్థులు

నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఓటు వేసేందుకు నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో వారిలో చైతన్యం నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పండగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సంస్థలు పోస్టు కార్డుల ద్వారా ప్రచారాన్ని  చేపడుతున్నాయి. ఇంకొన్ని సంస్థలు ‘నోటాకైనా ఓటేయండి’ అంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నగరంలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న యువకులు సుమారు 45 శాతం మంది ఉన్నారు. కానీ  ఓటు వేసేందుకు వృద్ధుల్లో ఉన్న ఉత్సాహం యువకుల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వారికి నచ్చే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు చైతన్యపరుస్తున్నాయి. మరికొన్ని సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే..

యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ గత కొన్నేళ్లుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు బదులుగా యువత మెచ్చే స్టాండప్‌ కామెడీ, రాక్‌బ్యాండ్‌ల ద్వారా ఓటు విలువను తెలియజేస్తోంది. 18 ఏళ్లు వచ్చాయని ఎవరో చెబితే ఓటరుగా నమోదవడం తప్ప మరే ఆలోచన లేని యువతలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అరుణ్‌ తెలిపారు. ‘షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే’ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నారు. యువతకు చేరువయ్యేలా తెలంగాణ లెట్స్‌ఓట్‌, ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీ పేరిట సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వారికి నచ్చే విధంగా మరికొద్ది రోజుల్లో స్టాండప్‌ కామెడీ, స్లాం పొయెట్రీ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు.

పోస్టుకార్డులతో ప్రచారం..

మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ  పోస్టుకార్డులతో ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం విద్యార్థులు ఒక్కొక్కరు రెండు పోస్టు కార్డులను రూపొందించారు. వీటిని తమ బంధవులు, ఇరుగు, పొరుగు వారికి పంపతూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు.

యూత్‌ఫర్‌ యాంటీ  కరప్షన్‌ (వైఏసీ)..

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏసీ) సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘ఈ దేశం నాదే అంటున్నావు. దేశ పౌరుడి అని గర్వపడుతున్నావు. ఓటు నా బాధ్యత కాదు అనడం సబబేనా’ అంటూ ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. నాయకులు ఇష్టం లేకపోతే ‘నోటాకైనా సరే ఓటేయ్‌’ అంటూ చైతన్యపరుస్తోంది. మరికొంత మంది సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని