logo

వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలు

జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారుల పరిశీలనలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు లెక్క తేలింది.

Published : 06 May 2024 04:12 IST

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గుర్తించిన యంత్రాంగం

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారుల పరిశీలనలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు లెక్క తేలింది. ఆయా ప్రాంతాల్లో పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లా పరిధిలో మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా,  1,200 మంది సూక్ష్మ పరిశీలకులను రంగంలోకి దింపుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గమనించాల్సిన అంశాలు, నిఘా, పోలింగ్‌ కేంద్రాలపై పర్యవేక్షణ వంటి కర్తవ్యాలను వారికి తెలియజేసేందుకు సోమవారం బంజారాహిల్స్‌లోని సేవాలాల్‌భవన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది.  

చివరి దశలో శిక్షణ.. మే 13న జరగనున్న ఎన్నికకు అధికార యంత్రాంగం దాదాపు సిద్ధమైంది. ప్రిసైడింగ్‌ అధికారి (పీఓ), సహాయ ప్రిసైడింగ్‌ అధికారి (ఏపీఓ), ఇతర ప్రిసైడింగ్‌ అధికారి (ఓపీఓ) బాధ్యతల్లో పనిచేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ దాదాపు 20 వేల మంది అధికారులను ఎంపిక చేశారు. వారందరికీ రెండు దశల్లో శిక్షణ పూర్తయింది.

కంటోన్మెంట్‌లో 1+5 పద్ధతిలో.. కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఉండటంతో ఆ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్యెల్యే ఓటరు కంపార్టుమెంటు, సికింద్రాబాద్‌ ఎంపీ ఓటరు కంపార్టుమెంటు ఉండాల్సిందే. అందువల్ల కంటోన్మెంట్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓ ప్రిసైడింగ్‌ అధికారి, మరో అయిదుగురు (ముగ్గురు ఓపీఓలు, ఇద్దరు ఏపీఓలు) ఉంటారని అధికారులు తెలిపారు. రెండు ఎన్నికలకు వేర్వేరుగా ఓటరు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉన్నందున ఇద్దరు అధికారులు అదనంగా అవసరమని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని