logo

ఉపాధి పెంచుతా.. విద్య, వైద్యం అందిస్తా

‘‘హైదరాబాద్‌ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్‌ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్‌ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం.

Updated : 09 May 2024 05:42 IST

హైదరాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ వలీవుల్లా

సమీర్‌

‘‘హైదరాబాద్‌ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్‌ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్‌ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం. ప్రతి ఎన్నికల్లోనూ చార్మినార్‌, బహదూర్‌పుర, యాకుత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో 40శాతంలోపే పోలింగ్‌ శాతం ఎందుకు నమోదవుతుంది? మతం పేరుతో మజ్లిస్‌.. భాజపాలు ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి.’’అని హైదరాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ అన్నారు. పాతబస్తీలోని సమస్యలు, అభివృద్ధి, విద్య, వైద్యం తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

 హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువ శాతం పోలింగ్‌ నమోదు కావడం వెనుక ప్రధాన కారణం బోగస్‌ ఓటర్లు. వాటిని అధికారులు ఎందుకు తొలగించడం లేదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.  ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరిస్తే పాతబస్తీలో ఓటర్లు స్వేచ్ఛగా వారి అభిప్రాయాలను ఓటు ద్వారా వెల్లడిస్తారు.  

 కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా అపరిశుభ్రత ఉంది. నాలాల విస్తరణ ఆగిపోయింది. చాలా పనులు నత్తనడకన
సాగుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు?

పాతబస్తీలో అపరిశుభ్ర వాతావరణానికి కారణం మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ అధికారులే. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు. రోడ్లను వారి సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. బల్దియాది ఖాయా.. పీయా.. చల్దియా.. మాదిరిగా ఉంది. నేను గెలిస్తే హైదరాబాద్‌ ఇన్‌ఛార్జి మంత్రి సాయంతో సమస్యలన్నీ పరిష్కరిస్తా.
మీ గెలుపోటములను ఏయే అంశాలు ప్రభావితం చూపనున్నాయి?
ఇక్కడి ఎన్నికల్లో జాతీయ అంశాలతోపాటు భాజపా, మజ్లిస్‌ మతతత్వ ధోరణి ప్రభావం చూపిస్తుంది. వారికి లౌకిక భావన లేదు. మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు. మా ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ లౌకిక విధానాలను వివరిస్తున్నాం. అందుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
మీ ప్రత్యర్థులు ఎవరని భావిస్తున్నారు
మీ దృష్టిలో వారి బలహీనతలు ఏవి?
ప్రధాన ప్రత్యర్థి భాజపానే. రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఎంతోమంది విదేశాలకు వెళ్లారు. రెండో ప్రత్యర్థి మజ్లిస్‌. పాతబస్తీ అంటే మజ్లిస్‌ అనే భ్రమ కల్పించారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరు.
ఇప్పటివరకు ఏమైనా సమస్యలు గుర్తించారా.. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ఏం చేస్తారు?
హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో చాలా సమస్యలున్నాయి. 70 శాతం ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. ప్రభుత్వ, బ్యాంకులపరంగా సాయం అందక యువత చిరువ్యాపారాలు, చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఉపాధి కోసం అత్యధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వం వారివైపు నిలబడి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.   ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

మీరు గెలిస్తే...మీ ప్రాధాన్య అంశాలేమిటీ?

ఎన్నికల ప్రచారంలో వేలమంది యువకులను కలుసుకున్నా. చాలామందికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు లేక చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారికి కావల్సింది నైపుణ్యాలు. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రెండేళ్లలో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తా. అర్హులైన యువకులకు బ్యాంకు రుణాలిప్పించి ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా చేస్తా. మౌలిక సదుపాయాల కల్పన, మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ పనులను పరుగులు పెట్టిస్తా.
ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని