logo

గండి పునర్నిర్మాణ పనులు షురూ!

రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు

Published : 17 Jan 2022 04:30 IST

రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు చెందిన నటరాజన్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. గండిక్షేత్రం కోటి రూపాయలు డిపాజిట్‌ చేయగా.. దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధి నుంచి రూ. 13.5 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం రూ.14.5 కోట్లకు టెండర్లు ఖరారు చేసి గత డిసెంబరులో పనులు మొదలు పెట్టారు. జనవరినెలాఖరుకి ఆలయ కట్టడాలను పడకొట్టడం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నూతన ఆలయాన్ని గ్రానైట్‌ రాళ్లతో సుందరంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణమంతా ఎక్కడ చూసినా గ్రానైట్‌ రాళ్లతో కనిపిస్తోంది.- న్యూస్‌టుడే, చక్రాయపేట

చేపట్టే పనులు ఇవే..
గండిక్షేత్రంలో ముఖ్యంగా గర్భాలయం, అర్ధ మండపం, మణి మండపం, మహా మండపం నిర్మించనున్నారు. అదేవిధంగా మూడంతస్తుల విమాన గోపురం, గోపురం చుట్టూ అన్ని అంతస్తుల్లోనూ రాతిపై చెక్కించిన విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. పడమటి వైపున ఉన్న పాత రాజగోపురాన్ని తొలగించి కొత్తది నిర్మిస్తారు. వీటన్నింటికీ గ్రానైట్‌నే వాడనున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే మొత్తం 130 రాతి స్తంభాల్లో 24 అనివిటి స్తంభాలు (పిల్లర్లు) మిగిలిన 106 చిత్రకంఠ స్తంభాలు ఏర్పాటు చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. 


పాత ఆలయ నిర్మాణాల తొలగింపు

సీఎం ప్రత్యేక శ్రద్ధ 
ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం చక్రాయపేట మండలంలో గండి క్షేత్రం ఉండడంతో ఆలయ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తూ నిధులు సకాలంలో వచ్చేట్లు కృషి చేస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. 
శరవేగంగా నిర్మాణ పనులు
గండి ఆలయాన్ని పడకొట్టే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో రాతి స్తంభాలతో నూతన గర్భగుడి పనులు చేపడతాం. 2023 జూన్‌ చివరి కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.          - ముకుందారెడ్డి, గండి ఆలయ సహాయ కమిషనర్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని