logo

భక్తులకు కల్యాణ కష్టం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కోడె మొక్కులతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.

Published : 23 May 2024 03:01 IST

భవనం సరిపోక తోపులాటలు
న్యూస్‌టుడే, వేములవాడ

కల్యాణాలు నిర్వహించే భవనం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కోడె మొక్కులతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో భాగంగా చాలా మంది ఆలయంలో కల్యాణాలు జరిపించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. మంచి రోజుల్లో నూతన వధూవరులు, ఇతరులు స్వామివారి సన్నిధిలో కల్యాణం చేయించుకొని మొక్కు తీర్చుకొంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కల్యాణం టికెట్‌ తీసుకున్న భక్తులకు ఆలయం ముందు ఉన్న కళా భవనంలో అర్చకులు కల్యాణం జరిపిస్తుంటారు. ఒక టికెట్‌పై దంపతులను మాత్రమే అనుమతిస్తారు. వాస్తవానికి కళాభవనంలో 150 జంటలు మాత్రమే కూర్చోవడానికి హాల్‌ సామర్థ్యం ఉంది. అయితే ఆలయ అధికారులు మాత్రం భక్తుల ఒత్తిళ్లతో 190 నుంచి 200 వరకు కల్యాణం టికెట్లను జారీ చేస్తుంటారు. అయినప్పటికీ చాలా మందికి టికెట్లు లభించక నిరాశతో వెళ్తుంటారు. టికెట్‌ లభించని సందర్భంలో మరో రోజు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

మంచి రోజుల్లో ఇబ్బందులే...

మంచి రోజులు, పెళ్లిళ్ల సీజన్‌లో రోజూ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి సందర్భంలో టికెట్లు లభించక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టికెట్లు లభించక కొత్త జంటలు కల్యాణం మొక్కును వాయిదా వేసుకోవడమో, మరో రోజు వేచి ఉండటమో  చేస్తుంటారు. రోజూ కల్యాణం టికెట్లను రూ. 1000లకు జారీ చేస్తుంటారు. ఒక టికెట్‌పై భార్యాభర్తలను మాత్రమే అనుమతిస్తుంటారు. బంధువులను అనుమతించరు. భక్తుల రద్దీ సమయంలో టికెట్లు లభించని వారు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల క్రితం 150 మంది జంటలు కూర్చుండే విధంగా కళా భవనం, హాల్‌ నిర్మించారు. ప్రస్తుతం ఏటేటా స్వామివారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటు కల్యాణాలు చేయించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో భవనం ఏ మాత్రం సరిపోవడం లేదు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అదనంగా కల్యాణం టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ ఇంకా లభించక వెనుదిరగాల్సిన పరిస్థితి కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కల్యాణ మొక్కుల ద్వారా ఆలయానికి ఏటా రూ. 3.5 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ విశాలమైన భవనం నిర్మించడం లేదు. దీంతో భక్తులకు బాధలు తప్పడం లేదు.

టికెట్లు దొరకక...

కొన్ని సందర్భాల్లో కళా భవనం వద్ద కల్యాణం టికెట్ల కోసం కౌంటర్‌ వద్ద భక్తుల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. నూతన వధూవరులతోపాటు పెద్ద ఎత్తున వారి బంధువులు వస్తుంటారు. వచ్చిన రోజే కల్యాణం మొక్కు తీర్చుకొని వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఇదే అదనుగా కొందరు దళారులు సీజన్‌లో టికెట్లను బ్లాక్‌ చేసి విక్రయించిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికైనా పెద్ద భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో మాస్టర్‌ ప్లాన్‌ ఉండటంతో ఆలయం వద్ద ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పెద్ద హాల్‌ కోసం ప్రతిపాదన

కల్యాణం మొక్కులు చెల్లించుకునే భక్తులు మంచి రోజులు, సీజన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద హాల్‌ నిర్మాణం అవసరముందనే విషయాన్ని దేవాదాయశాఖ అధికారులకు ప్రతిపాదన చేశాం. దాదాపు 500 మంది కూర్చుండే విధంగా విశాలమైన భవనం ఉంటే భక్తులకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుత భవనం సామర్థ్యానికి మించి కల్యాణం టికెట్లు జారీ చేస్తున్నాం. అయినా చాలా మందికి లభించక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తోపులాటలు చోటుచేసుకుంటున్న విషయం వాస్తవమే.

 శ్రీనివాస్, ఏఈవో, రాజన్న ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు