logo

అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికలకు సన్నద్ధం

సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో బ్యాంకు అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు.

Published : 23 May 2024 03:05 IST

సభ్యులు 6,945 మంది
ఓటు హక్కుకు అర్హులు 6,177 మంది
న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌

సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్న బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌

సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో బ్యాంకు అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. బ్యాంకు అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా వాటిని డివిజన్‌లుగా విభజించారు. ఓటు హక్కు పొందిన 6,177 మంది సభ్యులకు నూతనంగా గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. ఎన్నికలను స్థానిక నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవిని చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు రావడంతో పట్టణంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది.

నోటీసు జారీ

సహకార అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం ఎన్నికల నిర్వహణకు డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్నికల అధికారి టి.రామకృష్ణ బుధవారం నోటీసు జారీ చేశారు. ఎన్నికల నోటీసును విడుదల చేసి, ప్రస్తుత అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ గడ్డం విఠల్‌తో పాటు బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌కు అందజేశారు.

జూన్‌ 6న ఎన్నిక నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. అర్బన్‌ బ్యాంకులోనే ఈ నెల 27 నుంచి 29 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 30న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, అనంతరం అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల, 31న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. జూన్‌ 6న పట్టణంలోని గీతానగర్‌ జిజిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.

12 డివిజన్‌లుగా... 

అర్బన్‌ బ్యాంకులో మొత్తం 6,945 మంది సభ్యులు ఉండగా, వీరిలో 2023 మార్చి 31 వరకు ఉన్న సభ్యులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. 6,177 మంది ఓటు హక్కుకు అర్హత పొందారు. ఓటర్ల సంఖ్యను బట్టి మొత్తం 12 డివిజన్‌లుగా విభజించారు. 514 మంది ఓటర్లకు ఒక డివిజన్‌ కేటాయించగా, 12వ డివిజన్‌లో మాత్రం 523 మంది ఓటర్లు ఉన్నారు. 1, 2, 3, 4, 6, 8, 9, 11, 12 డివిజన్‌లు ఇతరులకు, 5వ డివిజన్‌ ఎస్సీ, ఎస్టీలకు, 7, 10, డివిజన్‌లు మహిళ (జనరల్‌)కు కేటాయించారు. నామినేషన్‌ రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000, బీసీలకు రూ.2,000, ఇతరులకు రూ.4000లుగా నిర్ణయించారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం

సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఎన్నికల నిర్వహణ కోసం పట్టణంలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దానిలో 12 బూత్‌లను ఏర్పాటు చేస్తాం. జూన్‌ 6న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తాం. 

టి.రామకృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్నికల అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని