logo

అనుమతి పత్రంతో అడ్డగోలు తరలింపు

పంట పొలాలకు చెరువుల నుంచి మట్టిని తరలించేందుకు ఇచ్చే అనుమతికి కూడా పరిమితి ఉంటుంది. నిర్ణీత పరిమాణం మేరకు ఎలాంటి వేబిల్లు అవసరం లేకుండా కేవలం అనుమతి పత్రాన్ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది.

Published : 23 May 2024 03:16 IST

ఇటుక బట్టీలకు ఇష్టారాజ్యంగా చెరువు మట్టి
న్యూస్‌టుడే, పెద్దపల్లి

రాఘవాపూర్‌ వద్ద రెవెన్యూ అధికారులు పట్టుకున్న లారీలు

పంట పొలాలకు చెరువుల నుంచి మట్టిని తరలించేందుకు ఇచ్చే అనుమతికి కూడా పరిమితి ఉంటుంది. నిర్ణీత పరిమాణం మేరకు ఎలాంటి వేబిల్లు అవసరం లేకుండా కేవలం అనుమతి పత్రాన్ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. కాగా జిల్లాలో మట్టి తరలింపు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. అందిన కాడికి దండుకునేందుకు అధికారులు, అక్రమార్కులు అడ్డదారులను వెదుకుతున్నారు. ఇటుక బట్టీలకు చెరువుల మట్టే ప్రధాన ముడి సరకు కావడంతో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల అండతో అడ్డూ అదుపూ లేకుండా మట్టి దందా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా నాలుగు చెరువుల నుంచి మట్టి తరలింపునకు మైనింగ్‌ అధికారులు అనుమతించారు. దీంతో ఇన్నాళ్లూ రాత్రి వేళకే పరిమితమైన మట్టి రవాణా రెండు రోజులుగా రోజంతా సాగుతోంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

  • చెరువు మట్టిని స్థానిక అవసరాలకే రైతులు, ఇతరులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాగా పెద్దపల్లి ప్రాంతంలోని ఇటుక బట్టీల కోసం కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి, అల్లూరు చెరువుల నుంచి తరలిస్తున్నారు.
  • నిబంధనల ప్రకారం ఒక గ్రామంలోని చెరువు మట్టిని మరో ఊరికి తరలించేందుకు కూడా నీటిపారుదల శాఖ అనుమతించదు. కానీ మైనింగ్‌ అధికారులు మాత్రం ఇతర మండలాల నుంచి కూడా తలరించేందుకు అనుమతిస్తున్నారు.
  • తరలించే మట్టికి వే బిల్లులు ఇవ్వకుండా కేవలం సాధారణ అనుమతి పత్రాలతోనే రవాణా చేస్తుండటం అక్రమాలను తేటతెల్లం చేస్తోంది.
  • నిబంధనల ప్రకారం మట్టి తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా వేబిల్లు ఉండాలి. అయితే చెరువు మట్టితో రైతుల అవసరాలు ముడిపడి ఉంటాయనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖ ఇచ్చే అనుమతి పత్రం వాహనం వెంట ఉంటే సరిపోతుందని మినహాయింపునిచ్చారు.
  • రైతుల కోసం ఉద్దేశించిన ఈ నిబంధనలను మైనింగ్‌ అధికారులు ఇటుక బట్టీ వ్యాపారులకు వర్తింపజేయడం అక్రమాలకు ఊతమిస్తోంది. దీంతో చెరువు నుంచి ఎంత మట్టిని తరలిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలేవీ పరిగణనలోకి తీసుకోక ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది.
  • ఇటుక బట్టీల నిర్వాహకులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. మట్టి రవాణాదారుకు, అధికారులకు మధ్య లోపాయకారీ ఒప్పందాలపై ఆరోపణలున్నాయి.

ప్రమాదంతో వెలుగులోకి..

పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ వద్ద బుధవారం కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంతో మట్టి అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణమైన లారీ అనుమతి పత్రాలను చూపించాలని కారు డ్రైవర్‌ నిలదీయడంతో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని విచారణ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు, వేబిల్లులు లేకపోవడంతో ఎనిమిది లారీలను సీజ్‌ చేశారు. అయితే మట్టి అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన కారు యజమాని లారీ నిర్వాహకులతో రాజీ కుదుర్చుకొని వెళ్లిపోవడం కొసమెరుపు.

చెరువు మట్టికి వే బిల్లులు అవసరం లేదు

క్వారీల నుంచి రవాణా చేసే మట్టి, మొరానికి మాత్రమే వే బిల్లులు జారీ చేస్తాం. చెరువుల నుంచి మట్టి రవాణా చేసే వారికి వేబిల్లులుండవు. కేవలం అనుమతి పత్రాలకు సంబంధించిన జిరాక్స్‌ ప్రతి వాహనం వెంట ఉంటే సరిపోతుంది.

శ్రీనివాస్, జిల్లా మైనింగ్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని