యువతకు నైపుణ్య శిక్షణ
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ
సారంగాపూర్, న్యూస్‌టుడే: యువత నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంత్రి ఈశ్వర్‌తోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్పర్సన్, ఇతర ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు యువత స్కిల్డ్, అన్ స్కిల్డ్ నైపుణ్యం సాధించేందుకు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఏటా బ్యాంకుల వారీగా లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లా జనాభాలో 16.73 శాతం ఉన్న షెడ్యూల్డు కులాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పథకాలపై సంచాలకులు(ఈడీ) ‘న్యూస్‌టుడే’కు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
స్వయం ఉపాధితో ఆదాయాభివృద్ధి
దళితుల సంక్షేమానికి ఏటా ప్రత్యేక ప్రణాళిక ద్వారా యువతకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారికి బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి, ఆదాయాభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. స్వయం ఉపాధి కోసం ఒక్కో యూనిట్‌పై 60 నుంచి 80 శాతం వరకు రాయితీ అందిస్తున్నాం. 2018-19లో 2162 యూనిట్లు లక్ష్యం కాగా రూ.55.29కోట్ల రాయితీ అందిస్తున్నాం. ఇందులో స్కిల్డ్ నైపుణ్యం కింద 2019 యూనిట్లకు రూ.51.52 కోట్ల రాయితీ, అన్ స్కిల్డ్ కింద 143 యూనిట్లకు రూ.4.06 కోట్ల రాయితీ అమలు చేయనున్నాం. ఇప్పటి వరకు 1519 యూనిట్లకు లబ్దిదారులను ఎంపిక చేసి రూ.36.24 కోట్ల రాయితీ జమ చేశాం. 2020-21లో 1023 యూనిట్లు కాగా స్కిల్డ్ డెవలప్మెంట్ కింద 775 యూనిట్లు, అన్‌స్కిల్డ్ కింద 248 యూనిట్లకు రూ.5276.59 లక్షల రాయితీ అందించనున్నాం.
ప్రత్యేక కార్యక్రమాలు
యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. భారీ, మధ్య తరహా వాహన డ్రైవింగ్ శిక్షణ, ప్రీప్రైమరీ టీచర్, ఫ్యాషన్ డిజైనింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కోర్సు, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్, జనరల్ వర్క్స్, సూపర్వైజర్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్, మేస్త్రీ కోర్సులను నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్ ప్లాస్టిక్స్ శిక్షణ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణతోపాటు ఉచిత వసతి కల్పిస్తున్నాం. ఇందులో 280 మంది యువతకు ఆయా నైపుణ్యతలో శిక్షణ ఇస్తున్నాం.
పైలెట్ ప్రాజెక్టు కింద రాయితీ పథకాలు
జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని గేదెలు, కూరగాయల పథకం ద్వారా పలువురు రైతులను ప్రోత్సహిస్తుండగా, 337 మంది లబ్ధిదారులకు రూ.1245 లక్షల రాయితీ సొమ్ము అందించనున్నాం. ఇందులో గేదెల పెంపకం కోసం 268 యూనిట్లు కాగా రూ.1072 లక్షలు మంజూరు చేశాం. ఇందులో 179 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.193.35 లక్షల రాయితీ అందించాం. కూరగాయల పెంపకం కోసం 69 మంది లబ్ధిదారులకు రూ.119.54 లక్షలు మంజూరు చేశాం. భూమిలేని దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల చొప్పున 40 కుటుంబాలకు 77.28 ఎకరాల భూమిని రూ.388.61 లక్షల వ్యయంతో కొనుగోలు చేసి అందించాం. పంట పొలాలకు వ్యవసాయ బావుల విద్యుద్దీకరణ కల్పించేందుకు ట్రాన్స్‌కో సంస్థకు ఒక్కో సర్వీస్ కనెక్షన్‌కు రూ.7వేలు కార్పొరేషన్ ద్వారా చెల్లిస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక ప్రణాళిక ద్వారా దళితులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఆదాయాభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నాం.
Advertisement