logo

ఆరుగాలం శ్రమ.. అంతులేని నిరీక్షణ

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించినా నెలల తరబడి సొమ్ము చేతికందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్‌ ముగిసి నెల రోజులు దాటినా డబ్బులు అందక, యాసంగి

Published : 22 Jan 2022 02:22 IST

వానాకాలం ధాన్యం డబ్బులు అందక అవస్థలు

మంథని మండలంలో రూ.25.63 కోట్ల బకాయిలు

చిన్నఓదాలలో ధాన్యం తూకం వేస్తున్న హమలీలు(పాతచిత్రం)

న్యూస్‌టుడే, మంథని గ్రామీణం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించినా నెలల తరబడి సొమ్ము చేతికందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్‌ ముగిసి నెల రోజులు దాటినా డబ్బులు అందక, యాసంగి సాగు పెట్టుబడి అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో మానసికంగా వేదన చెందుతున్న తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.

మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు 32 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతటా కలిపి 3.32 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. దాదాపు నెల రోజుల కిందటే కొనుగోళ్లు పూర్తయి కేంద్రాలను మూసివేశారు. కాగా ఇప్పటికీ చాలా మంది రైతులకు ధాన్యం డబ్బులు అందలేదు. సంఘం పరిధిలోని 32 కేంద్రాల్లో సేకరించిన ధాన్యానికి గాను 2,595 మంది రైతులకు రూ.36.34 కోట్లు చెల్లించారు. మరో 2,218 మందికి రూ.25.63 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం విక్రయించి నెలలు గడిచినా డబ్బులు చేతికందక రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ నెల 14 నుంచి చెల్లింపులు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి.

అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది -మానెం సత్యనారాయణ, సర్పంచి, మల్లారం

140 క్వింటాళ్ల ధాన్యాన్ని నెల రోజుల కిందటే విక్రయించాను. రూ.3 లక్షలకు పైగా రావాల్సి ఉంది. డబ్బులు చేతికందక వ్యవసాయ అవసరాల కోసం ఫైనాన్సు సంస్థల్లో తీసుకున్న అప్పు, బ్యాంకులో కట్టాల్సిన రుణం, ఎరువుల వ్యాపారులకు చెల్లింపులు నిలిచిపోయాయి. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో సాగు పనులు కూడా చేసుకోలేకపోతున్నాం.

రెండు నెలలుగా ఎదురుచూస్తున్నా.. -గొట్టె తిరుపతి, రైతు, నాగారంపల్లి

నేను నవంబరు 27న 440 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించాను. రూ.8 లక్షలపైగా రావాల్సి ఉంది. దీంతో కౌలుకు తీసుకున్న భూమి యజమానికి, ఎరువుల వ్యాపారులకు, బ్యాంకుకు సకాలంలో చెల్లించలేకపోతున్నాం. నిత్యం వారి నుంచి వచ్చే ఒత్తిళ్లు భరించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి సకాలంలో డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని