logo

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పట్టణ ప్రగతి

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పురపాలక సాధారణ సమావేశం అధ్యక్షురాలు బోగ శ్రావణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ

Published : 25 May 2022 02:39 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌, ఛైర్‌పర్సన్‌ శ్రావణి

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పురపాలక సాధారణ సమావేశం అధ్యక్షురాలు బోగ శ్రావణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సమీకృత మార్కెట్‌, వైకుంఠధామాల అభివృద్ధి జరిగిందని మోడ్రన్‌ దోభీఘాట్‌, బయోమైనింగ్‌, ఇంటింటికీ భగీరథ నీరు, డిజిటల్‌ డోర్‌ నెంబర్లు లక్ష్యం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. వార్డు కౌన్సిలర్లంతా స్వచ్ఛ హరిత జగిత్యాల దిశగా కృషి చేయాలని సూచించారు. పురపాలక అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. పట్టణ ప్రజలు కూడా బల్దియా అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. 25 ఎజెండా అంశాలను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కమిషనర్‌ స్వరూపరాణి పాల్గొన్నారు.

వాహనాల కొనుగోలులో అక్రమాలు..
బల్దియా వాహనాల కొనుగోలు, బిల్లుల చెల్లింపులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కల్లపల్లి దుర్గయ్య, ములస్తం లలిత, నక్క జీవన్‌ సహరాభాను, ఫర్హీన్‌సుల్తానా, ఆసియా సుల్తానా ఆరోపించారు. వైకుంఠ రథానికి రూ.16 లక్షలు వెచ్చించినా వాస్తవ ధరకు మున్సిపాలిటీ చెల్లించినదానికి చాలావరకు వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో వార్డుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఒక్కో వార్డులో ఒక్కోరోజులో 4 ట్రిప్పులు మాత్రమే చల్లించి రూ.1.92 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు కోరుతూ కలెక్టర్‌ రవికి వినతిపత్రం అందజేశారు.

పురపాలక అధికారుల నిర్లక్ష్యం: హన్మాండ్ల జయశ్రీ
సమావేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నారని 35 వార్డు కౌన్సిలర్‌ హన్మాండ్ల జయశ్రీ ఆరోపించారు. ఎజెండా ప్రతిలోని అంశాలను అధికారుల చేత వివరణ ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. బల్దియాలోని పలు విభాగాల్లో అక్రమాలపై తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని