logo

శుద్ధి కేంద్రానికి నిర్వహణ భారం

స్మార్ట్‌సిటీ.. సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఓడీఎఫ్‌++ మార్కులు, ర్యాంకులు తెచ్చి పెడుతుండగా దాని నిర్వహణ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా వాటర్‌+ సర్వే చేసిన సందర్భంలో కూడా ఈ యూజీడీ వివరాలను నమోదు చేసుకున్నారు.

Published : 25 Jun 2022 06:27 IST

 ఎస్టీపీ దగ్గర కనిపించని ప్రత్యేక వ్యవస్థ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

ప్లాంట్‌లో చుట్టూ మురుగు

స్మార్ట్‌సిటీ.. సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఓడీఎఫ్‌++ మార్కులు, ర్యాంకులు తెచ్చి పెడుతుండగా దాని నిర్వహణ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా వాటర్‌+ సర్వే చేసిన సందర్భంలో కూడా ఈ యూజీడీ వివరాలను నమోదు చేసుకున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ప్లాంట్‌ను పట్టించుకోకపోవడంతో అందులో ఉన్న యంత్రాలు కూడా తుప్పు పడుతున్నాయి.
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 2008 సంవత్సరంలో రూ.76.50 కోట్లతో భూగర్భ మురుగు కాల్వ పనులు(యూజీడీ) ప్రారంభించారు. ఎన్నో సమస్యలు, సవాళ్ల మధ్య అప్పటి కలెక్టర్‌, కమిషనర్లు, అధికారులు చొరవ చూపి కోట్లు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టును మధ్యలోనే నిలిపి వేయకుండా పూర్తి చేయించారు. అదనంగా అవసరమైన నిధులు కూడా విడుదల చేసి దీనికి రూపు తీసుకొచ్చారు. 2055 జనాభాకు సరిపడే విధంగా భూగర్భ మురుగునీటిని శుద్ధి చేసేందుకు దీనిని రూపకల్పన చేశారు. పాత 50 డివిజన్ల పరిధిలో సుమారు 320 కిలో మీటర్ల పొడవునా పైపులైను వేశారు.

38 ఎంఎల్‌డీల సామర్థ్యంతో..
నగర శివారులోని గోపాల్‌ చెరువు దగ్గర 10 ఎకరాల స్థలంలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) 38ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించారు. నగరంలో సుమారు 8 వేల ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించగా నాలుగైదు డివిజన్ల నుంచి 3వేల ఇళ్లకు అనుసంధానం చేసిన మురుగునీటిని ఇందులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 3ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేసి సమీపంలోని చెరువుల్లోకి వదులుతున్నారు. కాగా దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి స్మార్ట్‌సిటీలో పొందు పర్చారు. పైగా మానవ వ్యర్థాలు శుభ్రం చేసేందుకు ఎఫ్‌ఎస్‌టీపీలు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.
ఒక మోటారుతోనే పనులు
మురుగునీరు శుద్ధి చేసేందుకు మొత్తం ఐదు మోటార్లు ఉండగా అందులో ఒక మోటారు మాత్రమే పని చేస్తోంది. మిగతా నాలుగు మోటార్లు ఆరు నెలలుగా మూలన పడ్డాయి. సాంకేతిక సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా వాటిని కూడా ఏర్పాటు చేయడం లేదు. చిన్న మరమ్మతులు కూడా గుర్తించడం లేదు. ఎక్కువ సేపు మోటార్లు నడిపిస్తే శబ్ధం వస్తుందని అక్కడున్న వారు అడ్డుకొని, గేటుకు తాళాలు వేస్తున్నారు. పలు సందర్భాల్లో వ్యర్థాల ట్యాంకర్లను కూడా రానివ్వడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఎస్టీపీ చుట్టూ రోడ్డు ఆక్రమణలు, భవనాలు నిర్మిస్తున్న అభ్యంతరం తెలపడం లేదు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్థలానికి ప్రస్తుతమున్న స్థలానికి పొంతన లేదు. కబ్జా అవుతుందని సమాచారం అందిస్తున్న మాకేందుకు అనే ధోరణి తప్ప అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.


ప్లాంట్‌లోనే వరదనీరు
ఇళ్ల నుంచి వచ్చే నీరు తక్కువగానే ఉండగా స్మార్ట్‌సిటీలో భాగంగా ఈ మధ్య వరదకాల్వల పనులను ప్రారంభించారు. ఇందులోంచి వచ్చే మురుగు భూగర్భ ఛాంబర్లకు మళ్లించడం, వర్షాలతో పక్కనున్న డ్రైనేజీ నీరంతా ప్లాంట్‌లోకి చేరింది. మూడింటి నుంచి వచ్చిన నీరు అధికమై ప్లాంట్‌  మురుగుమయంగా మారింది.


అధ్యయనం చేస్తున్నాం..
- సేవా ఇస్లావత్‌, కమిషనర్‌, నగరపాలిక

ప్రస్తుతం తక్కువ ఇళ్ల నుంచి మురుగునీరు ఎస్టీపీలోకి వస్తోంది. స్మార్ట్‌సిటీలో ఎక్కువ ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చే ప్రణాళిక ఉంది. పూర్తిస్థాయిలో వినియోగించు కోవడానికి అధ్యయనం చేస్తున్నాం. సామర్థ్యం పెంచి మురుగునీటిని శుద్ధి చేయడం జరుగుతుంది.

 


వదిలేశారు..
సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ) దగ్గర మూడు ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేసేందుకు కొంతమంది కార్మికులు ఉండగా అధికారులతో కూడిన ప్రత్యేక వ్యవస్థ మాత్రం కనిపించడం లేదు. తాగునీటి శుద్ధి కేంద్రం ఎలా ఉంటుందో అదే స్థాయిలో మురుగునీరు శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది. దీనికి నిపుణులైన ఇంజినీర్లు లేకపోవడం, సమస్యలు వస్తే వెంటనే స్పందించేందుకు నగరపాలక తరఫున ప్రత్యేక విభాగం లేకపోవడంతో ఇన్‌ఛార్జి డీఈఈలు, ఏఈలు ఈ వైపే తొంగి చూడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని